అదే జరిగితే చాలా విచారకరం: వొడాఫోన్ ఐడియా పేరు లేకుండా సునీల్ మిట్టల్
భారత్‌లో 2 టెలికం కంపెనీలు మాత్రమే మిగిలితే అది బాధాకరమేనని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. దేశీయ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా భారీ ఆర్థిక నష్టాల్లో మునిగిపోయింది. ఇది ఎప్పుడైనా మూతపడవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ మిట్టల్ స్పందించారు. అయితే ఆయన ఎక్కడ కూడా పేరును ప్రస్తావించలేదు. వొడాఫోన్ ఐడియా పేరును ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యానించారు. గతంలో 12 టెల్కోలు ఉండగా ఇప్పుడు తగ్గిపోతే అది విషాధకరమే అన్నారు.

సునీల్ మిట్టల్ ఆశాభావం
'గతంలో మన వద్ద 12 మంది ఆపరేటర్లు ఉన్నారు. ఇప్పుడు అది 2.5కి పడిపోయింది. ఇది కూడా మున్ముందు రెండుకు పడిపోతే బాధాకరం. దేశం చాలా పెద్దది. కాబట్టి మూడు ప్రయివేటు ఆపరేటర్లు ఉంటే మంచిది. మూడు టెలికం సంస్థలు ఉండేందుకు అర్హమైన దేశం. కాబట్టి ఇలాగే కొనసాగుతుందని తాను ఆశిస్తున్నాను' అని సునీల్ మిట్టల్ అన్నారు.

ఎయిర్ టెల్ పైపైకి..
ఎయిర్‌టెల్ రోజురోజుకు చాలావేగంగా వృద్ధిని నమోదు చేస్తోందని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ అన్నారు. మార్కెట్ షేర్ చాలా వేగంగా పెంచుకుంటోందని తెలిపారు. ఆఫ్రికాలోను విస్తరిస్తోందని తెలిపారు. భారతీకి చెందిన వన్ వెబ్స్ శాటిలైట్ బ్రాడ్‌బాండ్ ఆపరేషన్స్ మార్కెట్‌లో గేమ్ చేంజర్ కానుందని తెలిపారు. ఎయిర్‌టెల్ వృద్ధికి ఇది మరింత దోహదపడుతుందన్నారు.

పెట్టుబడుల ఆకర్షణ
కొత్త ప్రపంచ ఇన్వెస్టర్లను ఆకర్షించడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను సమీకరిస్తున్నట్లు తెలిపారు. గత 24 నెలల కాలంలో 12 బిలియన్ డాలర్లు సమీకరించామన్నారు. వొడాఫోన్ ఐడియా కూడా రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధపడింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ ప్రకటన చేసినప్పటికీ సరైన ఇన్వెస్టర్ ఇప్పటి వరకు రాలేదు.


Click it and Unblock the Notifications