ఐటీ ఉద్యోగాల కోత: మేనేజర్ కంటతడి, రెడిట్‌లో వైరల్ పోస్ట్!
ఐటీ కంపెనీలలో ఉద్యోగాల కోత ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఉన్నపళంగా ఒకే ఒక్క మెయిల్‌తో ఉద్యోగులను తీసేస్తున్నారు. ఇలా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో, చెన్నైకి చెందిన ఓ ఐటీ మేనేజర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి, రెడిట్ (Reddit)లో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్లిన తనను పై అధికారులు ఓ ప్రత్యేక గదిలోకి పిలిచి, ఒక ఎక్సెల్ షీట్ చేతికిచ్చారని అందులో పేర్కొన్నారు. ఆ షీట్‌లో మొత్తం 12 మంది ఉద్యోగుల పేర్లు ఉన్నాయి. వాళ్లందరినీ శుక్రవారం లోగా ఉద్యోగంలోంచి తీసేయాలని తనకు ఆదేశాలు అందాయి. ఒక్కో ఉద్యోగితో మాట్లాడి, వాళ్లను ఎందుకు తొలగిస్తున్నారో చెప్పడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారట.
ఈ లిస్టులో ఉన్నవాళ్లెవరూ కొత్తవాళ్లు కాదు. దాదాపు 10 ఏళ్లుగా, అంటే 2016 నుంచి నాతో కలిసి పనిచేస్తున్న నా సహోద్యోగులు. ఎన్నో రాత్రులు మేల్కొని, తెల్లవారుజామున 3 గంటల వరకు కంపెనీ కోసం కలిసికట్టుగా కష్టపడ్డాం. వాళ్లంతా నాకు స్నేహితులు, కుటుంబ సభ్యుల వంటి వాళ్లు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వీరిలో చాలామంది నన్ను ప్రేమగా 'అన్నా' అని పిలుస్తారు. వాళ్ల తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబ పరిస్థితులు అన్నీ నాకు తెలుసు. అలాంటి వాళ్లను పిలిచి, 'ఇకపై మీకు ఉద్యోగం లేదు' అని నేను ఎలా చెప్పగలను? అని ఆ మేనేజర్ తన పోస్టులో వాపోయారు.
ఉద్యోగం తీసేయాల్సిన వాళ్ల లిస్టులో ఒక సీనియర్ డెవలపర్ ఉన్నారు. ఆయన కొద్ది నెలల క్రితమే సొంత ఇంటి కోసం పెద్ద మొత్తంలో హోమ్ లోన్ తీసుకున్నారు. మరో ఉద్యోగి తల్లి క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఆమె వైద్య ఖర్చులన్నీ కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ఇంకో ఉద్యోగి భార్యకు వచ్చే నెల డెలివరీ కాబోతోంది అని ఆయన వివరించారు.
ఇంతటి కష్టాల్లో ఉన్న ఉద్యోగుల దగ్గరికి వెళ్లి, 'మీ సామాన్లు సర్దుకుని వెళ్లిపోండి' అని ఎలా చెప్పాలి? అని ఆ మేనేజర్ ప్రశ్నించారు. కంపెనీలు తీసుకునే ఇలాంటి కఠినమైన నిర్ణయాలకు మాలాంటి మిడిల్ మేనేజర్లే బలిపశువులు అవుతున్నారు. పై అధికారులకు ఉద్యోగుల కన్నీళ్లు, వాళ్ల కుటుంబ కష్టాలు కనిపించవు. వాళ్లకు కేవలం పని జరగాలి, అంతే అని ఆయన ఆవేదన చెందారు.
ఈ పని చేసే బదులు, నేనే రాజీనామా చేసి వెళ్లిపోతే బాగుంటుందని అనిపించింది. కానీ, నేను మానేసినా పరిస్థితి మారదు. నా స్థానంలో మరో మేనేజర్ వచ్చి ఎలాగూ వాళ్లను తీసేస్తాడు అనే వాస్తవం నన్ను తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురిచేసింది. ఉద్యోగం కోల్పోబోతున్న ఆ ఉద్యోగులను నేను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు అని తన పోస్టును ముగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది.


Click it and Unblock the Notifications