IT jobs: కేవలం జీతం నమ్ముకుంటే కష్టమే! ఐటీ ఉద్యోగుల్లో మారుతున్న ట్రెండ్!
ప్రస్తుతం ఐటీ రంగం (IT Sector) లో పరిస్థితులు మునుపటిలా లేవు. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే జీవితాంతం స్థిరంగా ఉంటుందనే నమ్మకం ఉండేది. కానీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం పెరగడం, నియామకాలు మందగించడం, గ్లోబల్ మార్కెట్ లో అనిశ్చితి వంటి కారణాలతో టెక్కీలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నారు. ప్రస్తుతం టెక్కీలు ఎలా ఆలోచిస్తున్నారంటే..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కేవలం ఒక కంపెనీ ఇచ్చే జీతం మీద ఆధారపడకుండా, 'గిగ్ వర్క్' (Gig Work) లేదా ఫ్రీలాన్స్ ప్రాజెక్టుల ద్వారా అదనపు ఆదాయం పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనినే చాలామంది మూన్‌లైటింగ్ గా పిలుస్తున్నప్పటికీ.. ఇప్పుడు ఇది ఒక ప్రత్యామ్నాయ కెరీర్ మార్గంగా మారుతోంది.

పెరిగిన గిగ్ వర్క్ క్రేజ్
దాదాపు పదేళ్ల అనుభవం ఉన్న షారన్ సురేష్ వంటి సీనియర్ ఇంజనీరింగ్ అనలిస్టులు ఇప్పుడు ఫ్రీలాన్స్ ప్రాజెక్టుల ద్వారా గంటకు రూ. 2,000 వరకు సంపాదిస్తున్నారు. ఆస్ట్రేలియా, టెక్సాస్ వంటి విదేశీ క్లైంట్లతో కలిసి పని చేస్తూ.. ఆటోమేషన్ ప్రాజెక్టుల ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. చాలా కంపెనీలు తమ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఫుల్-టైమ్ ఉద్యోగుల కంటే.. నైపుణ్యం కలిగిన ఫ్రీలాన్సర్లకే మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల నిపుణులకు పనిలో వెసులుబాటుతో పాటు ఆదాయం కూడా మెరుగుపడుతోంది.
విద్యార్థులూ తగ్గేదేలే!
కేవలం అనుభవం ఉన్నవారే కాదు.. చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఈ రంగంలో రాణిస్తున్నారు. చిన్మయి అనే మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని డిగ్రీ పూర్తి కాకముందే ఐదు ఐటీ ప్రాజెక్టులు పూర్తి చేసి తన పోర్ట్ ఫోలియోను సిద్ధం చేసుకుంది. టింబక్ డూ (TimbuckDo) వంటి ప్లాట్‌ఫారమ్ ల ద్వారా నైపుణ్యం ఉన్న విద్యార్థులు గంటకు రూ. 850 నుంచి రూ. 1,500 వరకు సంపాదిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ, టెస్టింగ్ వంటి ప్రత్యేక రంగాల్లో పట్టు ఉన్నవారికి డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది. అయితే బేసిక్ డిజైనింగ్, డెవలప్‌మెంట్ పనులకు ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో వాటి రేట్లు గంటకు రూ. 450 నుంచి రూ. 550 కు పడిపోయాయి.
2026 లో భారీగా నియామకాలు
గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్ సంస్థల నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఫ్రీలాన్స్ రేట్లు ఏడాది కాలంలో 11% పెరిగాయి. ముఖ్యంగా భారతదేశంలో ఐటీ గిగ్ ఎకానమీ 2026లో మరింత వేగంగా వృద్ధి చెందనుంది. గత ఏడాదితో పోలిస్తే ప్రాజెక్ట్ ఆధారిత నియామకాలు 60% పెరిగే అవకాశం ఉందని రాండ్‌స్టాడ్ డిజిటల్ (Randstad Digital) అంచనా వేస్తోంది. భవిష్యత్తులో స్థిరమైన ఉద్యోగాల కంటే, స్కిల్స్ ఆధారంగా పనిచేసే ఈ గిగ్ వర్క్ సంస్కృతి ఐటీ జాబ్స్ (IT Jobs) మార్కెట్ ను శాసించేలా కనిపిస్తోంది.
చివరగా ఐటీ నిపుణులు కేవలం ఒక్క జాబ్ మీద మాత్రమే ఆధారపడకుండా తమ నైపుణ్యాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేసుకుంటూ అదనపు ఆదాయ వనరులను సృష్టించుకుంటున్నారు. ఇది ఆర్థిక భద్రతను ఇవ్వడమే కాకుండా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో వారిని ముందు వరుసలో ఉంచుతోంది.


Click it and Unblock the Notifications