ఐటీ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేస్తా అనడం ఈ మధ్య ఓ ఫ్యాషన్ అయిపోయింది. కానీ, అలా వెళ్లిన వాళ్లందరూ సక్సెస్ అయ్యారా? అంటే లేదనే చెప్పాలి. ఇదే కఠోర వాస్తవం. ఇదే కోవలో, 14 ఏళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి, గత 10 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ పదేళ్లలో వ్యవసాయం తనకు నేర్పిన పాఠాల గురించి ఓపెన్‌గా పంచుకున్నారు.

ఐటీ జాబ్ వదిలి వ్యవసాయంలోకి రావాలనుకునే వాళ్లు కొన్ని విషయాలకు కచ్చితంగా సిద్ధపడి ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు. రెడిట్ ప్లాట్‌ఫామ్‌లో తన అనుభవాలను పంచుకున్న ఈ మాజీ ఐటీ ఉద్యోగి, 'నేను 14 ఏళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాను. పదేళ్ల క్రితం ఆ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం మొదలుపెట్టాను' అని తన పోస్టులో పేర్కొన్నారు.
వ్యవసాయం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది, కానీ కొన్ని వాస్తవాలను కూడా అర్థం చేసుకోవాలని ఆయన చెబుతున్నారు. వ్యవసాయం చేయడం చాలా కష్టమైన పని. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఇది అంత సులభం కాదు. ఇందులో లాభాలు కూడా తక్కువగానే ఉంటాయి. అన్ని పనులు మీరే చేసుకుంటే లాభం కాస్త పెరగొచ్చు. కానీ చాలా సందర్భాల్లో కూలీలను పెట్టి పని చేయించాల్సి ఉంటుంది.
ఐదు ఎకరాల కంటే తక్కువ భూమిలో వ్యవసాయం చేస్తే రిస్క్ తక్కువ, లాభం కూడా తక్కువే. అదే ఐదు ఎకరాలకు మించి సాగు చేస్తే రిస్క్ ఎక్కువ, లాభం కూడా ఎక్కువే. అలాగే, వ్యవసాయంలోకి అడుగుపెట్టే ముందే ఏ పంట వేయాలనే దానిపై స్పష్టత ఉండటం చాలా ముఖ్యం. వేరే దేశాల్లో జరిగే యుద్ధాల నుంచి వాతావరణ మార్పుల వరకు ప్రతీది మీ వ్యాపారంపై ప్రభావం చూపుతుంది. ఆరు నెలల పాటు మీరు డబ్బు, శ్రమ రూపంలో పెట్టుబడి పెడుతూనే ఉండాలి. కానీ, దాని ఫలితం ఎలా ఉంటుందనేది బయటి అంశాలే నిర్ణయిస్తాయి.
వ్యవసాయం ప్రారంభించే ముందు నేల స్వభావం, పురుగుమందులు, పంటలకు వచ్చే తెగుళ్లు, మార్కెట్‌లో పంటకు ఉన్న డిమాండ్ వంటి విషయాలపై పూర్తిగా రీసెర్చ్ చేయాలి. మీరు ఇప్పటికే రైతు కుటుంబం నుంచి వచ్చినవారైతే ఇది మీకు సులభం కావచ్చు. కానీ, మీ దగ్గర డబ్బు, సమయం ఉంటేనే వ్యవసాయంలోకి రండి. అంతేకాదు, కుటుంబ సభ్యుల మద్దతు కూడా చాలా అవసరం అని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆయన పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'నేను రైతు కుటుంబం నుంచే వచ్చాను, వ్యవసాయం చాలా కష్టమైన పని. ఈ విషయం తెలియక చాలా మంది ఫెయిల్ అవుతున్నారు' అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు 'ఇదే అసలైన నిజం. ఇది తెలియకుండా ఎవరూ మంచి ఉద్యోగాలను వదులుకోవద్దు' అని సలహా ఇచ్చారు. కేవలం లాభం కోసమే ఈ రంగంలోకి రావొద్దని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications