IIT Placements: ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌లలో ఫైనల్ ప్లేస్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు దాటింది. కానీ గతేడాదితో పోలిస్తే ఈసారి 15 నుంచి 30 శాతం మేర ప్లేస్‌మెంట్లు తగ్గుముఖం పట్టడం గడ్డు పరిస్థితులకు అడ్డంపడుతోంది.
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా ప్లేస్‌మెంట్ రాకపోవడం ఇదే మొదటిసారని చాలా మంది చెబుతున్నారు. ఇలా మునుపెన్నడూ జరగలేదని తెలుస్తోంది. పాత ఐఐటీలో ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన వర్గాలు ఈ సమాచారాన్ని అందించాయి. ఇందులో దిల్లీ, బాంబే, కాన్పూర్, మద్రాస్, ఖరగ్‌పూర్, రూర్కీ, గౌహతి, వారణాసి ఐఐటీలు ఉన్నాయి.

ఐఐటీలకు ఉన్న క్రేజ్ కారణంగా..ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు వీటిలో చేరేందుకు పరీక్ష రాస్తుంటారు. ఈ ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశం పెద్ద జీతాలు పొందేందుకు హామీగా పరిగణించబడుతుంది. గత సంవత్సరం టెక్ పరిశ్రమలో అలుముకున్న మందగమనం ఉన్నప్పటికీ IITలలో ప్లేస్‌మెంట్లు మెరుగ్గా ఉన్నాయి. అయితే ప్రస్తుతం దిగ్గజ టెక్ కంపెనీలు సైతం కొత్త నియామకాలను నిలిపివేశాయి. అలాగే క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లను నిలిపివేశాయి. గతంలో 8-10 మందిని రిక్రూట్ చేసుకునే కంపెనీలు ప్రస్తుతం ఒకరిని లేదా ఇద్దరిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నట్లు ఐఐటీ-ఖరగ్‌పూర్ విద్యార్థి తెలిపాడు. గతేడాది పరిస్థితి మెరుగ్గా ఉందని ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్ సెల్‌కు చెందిన విద్యార్థి తెలిపారు.
కొన్ని కంపెనీలు క్యాంపస్‌కు వస్తున్నా రిక్రూట్‌మెంట్ చేయడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఆఫర్లు 30 శాతం తగ్గాయని మరో పాత ఐఐటీ విద్యార్థి తెలిపారు. ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌లలో తుది నియామకాలు డిసెంబర్ 1న ప్రారంభమయ్యాయి. టెక్, కన్సల్టింగ్‌తో సహా అన్ని రంగాలలో మందగమనం ప్రభావం కనిపిస్తోంది. ఇంతకుముందు విద్యార్థులను నియమించుకోవడానికి కంపెనీల మధ్య పోటీ ఉండేదని ఓ విద్యార్థి చెప్పాడు. ఐఐటీ ఖరగ్‌పూర్ కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ చైర్‌పర్సన్ రాజీవ్ మైతీ మాట్లాడుతూ.. ఇన్‌స్టిట్యూట్‌కు ఏడు రోజుల్లో 1,181 ఆఫర్‌లు వచ్చాయన్నారు. గతేడాది ఐదు రోజుల్లోనే 1,300 ఆఫర్లు వచ్చాయి. మెుత్తానికి ఐఐటీల్లో పరిస్థితి దయనీయంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications