Infosys News: టెక్కీలకు దిమ్మతిరిగే షాక్.. వేరియబుల్ పే లో భారీ కోత విధింపు..
Infosys News: దేశంలో అన్ని కంపెనీలు నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆదాయాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు చెల్లించే వేరియబుల్ వేతనాల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
వ్యాపార వాతావరణం అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దిగజారుతున్న తరుణంలో భారతీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసిన నాలుగో త్రైమాసికానికి తన ఉద్యోగులకు సగటున 60 శాతం వేరియబుల్ వేతనాన్ని అందజేయనున్నట్లు వెల్లడైంది. దీంతో చాలా ఆశలు పెట్టుకున్న టెక్కీలకు అనుకోని షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. మరో పక్క ఉద్యోగ అవకాశాలు సైతం నామమాత్రంగానే ఉన్నాయని వారు చెబుతున్నారు.

కంపెనీ ఉద్యోగులకు పంపించిన మెయిల్ ప్రకారం .. ప్రతి ఉద్యోగికి ఖచ్చితమైన చెల్లింపు వారి సంబంధిత శాఖ మార్గదర్శకాలకు లోబడి ఉంటుంటాయని వెల్లడించింది. అలాగే ఉద్యోగి పే గ్రేడ్, విభాగాల ఆధారంగా చెల్లింపుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని తెలిపింది. కంపెనీ FY23లో కంపెనీ మొత్తం బలమైన పనితీరును కనబరిచిందని అంతర్గత ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు వెల్లడించింది. ఇదే సమయంలో మార్కెట్ అస్థిరతలు, ఊహించని సంఘటనలను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా అమెరికా, యూరోపియన్ మార్కెట్లలో ఏడాది ప్రారంభంలో జరిగిన బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ఐటీ పరిశ్రమపై పెరుగుతున్న ఒత్తిడిని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.6,128 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది డిసెంబరు త్రైమాసికం కంటే దాదాపు 16 శాతం వరకు తక్కువని తెలుస్తోంది.

గతంలో సైతం కంపెనీ ఉద్యోగులకు వేరియబుల్ పే విషయంలో తగ్గింపులను ప్రకటించిన విషయం తెలిసిందే. క్యూ-4 ఫలితాలపై మాట్లాడిన సీఈవో సలీల్ పరేఖ్ తాము మధ్యస్థ కాలంలో అధిక మార్జిన్‌లకు మార్గాన్ని నిర్మించడానికి సామర్థ్యం, వ్యయంపై అంతర్గత కార్యక్రమాన్ని విస్తరించామని తెలిపారు. అలాగే హ్యూమన్ రిసోర్సెస్, ఖాతాదారులకు మద్దతుగా పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తున్నారు. మార్చి త్రైమాసికంలో ఐటీ సంస్థలో అట్రిషన్ రేటు 20.9 శాతంగా నమోదైంది.


Click it and Unblock the Notifications