IT News: ఆందోళనలో భారత టెక్ కంపెనీలు.. యాక్సెంచర్ షాకింగ్ సమాచారం..
IT News: ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణంతో అలుముకున్న వ్యాపార, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న వేళ ఐటీ కంపెనీల వ్యాపారం మందగించింది. దీంతో ఈ రంగంలోని ఉద్యోగులు వేతన పెంపులు, వేరియబుల్ వేతనాలు తక్కువగా ఉండటంతో బాధపడుతున్నారు.
ఈ పరిస్థితిలో ఐటీ రంగంలో స్వల్ప మాంద్యం ఏర్పడుతుందని NetApp వ్యవస్థాపకుడు, CEO జార్జ్ గురియన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ కీలక ప్రకటన చేసింది. పూర్తి ఏడాదికి యాక్సెంచర్ రాబడి, మొదటి త్రైమాసిక ఆదాయాలను తక్కువగా అంచనా వేసింది. ఇన్వెస్టర్ల అంచనాల కంటే ఇవి తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే కంపెనీలు 2024 ఆర్థిక సంవత్సరంలో ఐటీ స్పెండింగ్ తగ్గుతుందని వెల్లడించింది.

వడ్డీ రేట్ల ఒత్తిడితో పాటు అధిక ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది నాటికి ఐటీ సేవల డిమాండ్ పై ప్రభావం చూపుతాయని యాక్సెంచర్ వెల్లడించింది. నాల్గవ త్రైమాసిక ఆదాయ లక్ష్యాలను కోల్పోవడంతో గురువారం ట్రేడింగ్‌లో యాక్సెంచర్ షేర్లు దాదాపు 5% క్షీణించాయి. భారత ఐటీ పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా అంచనాలు చెబుతున్నాయి. దేశంలో అతిపెద్ద IT సేవల సంస్థ TCS కంటే ఎక్కువ సంపాదించే యాక్సెంచర్ ధోరణి ఇతర ప్రముఖ IT సేవల కంపెనీల మాదిరిగానే ఉంది.
రెండవ త్రైమాసికం ముగిసిన వేళ దేశీయ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ తన ఫలితాలను అక్టోబర్ 12న ప్రకటించనుంది. కంపెనీ జూలైలో తన పూర్తి-సంవత్సర ఆదాయ అంచనాను సగానికి తగ్గించిన సంగతి తెలిసిందే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇప్పటికే గణనీయమైన విజయాన్ని సాధించింది. యాక్సెంచర్ ప్రకటించిన ఆదాయ వృద్ధి మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఉండటం టెక్ రంగంలోని ఇతర కంపెనీలను, మార్కెట్ ఇన్వెస్టర్లను, ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.


Click it and Unblock the Notifications