E20 Petrol: కొత్త కారు.. ఈ20 పెట్రోల్‌తో షెడ్డుకెళ్లింది.. ఫైర్ అయిన వాహన దారుడు..!
ఈ20 పెట్రోల్ పై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ పెట్రోల్ వాడడం వల్ల వాహనాలు చెడిపోతున్నాయని చాలా చెబుతున్నారు. అయితే రవాణా అధికారులు అలాంటి ఏమి లేదని చెబుతున్నారు. ఈ20 పెట్రోల్ వాడడం వల్ల చాలా వాహనాలు దెబ్బతింటున్నాయని ఇందుకు సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. కొత్త కారు కొని 12 వేల కిలోమీటర్లు వెళ్లగానే.. కారు ఆగిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 12 వేల కిలోమీటర్లు మాత్రమే నడిచిన ఓ కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ పెద్ద లోపానికి గురవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బీహార్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్, జర్నలిస్టు మనీష్ కశ్యప్ తన కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ కేవలం 12వేల కిలోమీటర్లు మాత్రమే నడిచిన తర్వాత ఇంజిన్‌లో తీవ్రమైన సమస్యలు వచ్చాయని ఆరోపిస్తున్నారు. వాహనం కొనుగోలు చేసినప్పుడు పూర్తిగా E20 కంపాటిబుల్ అని కంపెనీ చెప్పి విక్రయించినప్పటికీ, వాస్తవానికి ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ కారణంగానే ప్రస్తుతం బ్రేక్ డౌన్ అయినట్లు మెకానిక్ చెప్పినట్లు వివరించారు. కారును కొనుగోలు చేసే సమయంలోనే 2 లక్షల కిలోమీటర్ల ఎక్స్ టెండెడ్ వారంటీ తీసుకున్నట్లు కశ్యప్ప్ పేర్కొన్నారు. అయితే ఇంజిన్ రిపేర్ ను వారంటీ కింద చేయడానికి టెయోటా షోరూమ్ వారు ఒప్పుకోలేదని తెలిపారు. దీంతో రూ.లక్ష ఖర్చు పెట్టి రిపేర్ చేయించినట్లు వెల్లడించాడు.

సర్వీస్ సెంటర్ సిబ్బంది కూడా కెమెరా ముందే ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వల్లే ఇంజిన్ చెడిపోయే ప్రమాదం ఉందని చెప్పినట్లు గుర్తు చేశాడు. కశ్యప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది వాహనదారుల్లో భయం మొదలైంది. తన కారు చెడిపోవడంపై మనీశ్ కశ్యప్ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై విరుచుకుపడ్డారు. ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలు చెడిపోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ముడి చమురు దిగుమతులు తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఇథనాల్ కలిపి విక్రయిస్తోంది. అయితే ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలు చెడిపోతున్నాయని కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు ఈ పెట్రోల్ వల్ల మైలేజ్ కూడా తగ్గుతుందని చెబుతున్నారు. దీంతో చాలా మంది పెట్రోల్ కారు బదులుగా ఈవీ కార్లు కొంటే మంచిదేమోనని భావిస్తున్నారు. కాగా పెట్రోల్ లో ఇథనాలు కలపడంపై కొంత మంది కోర్టుకు వెళ్లారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కోర్టుకు సమాధానం ఇచ్చింది. ఇథనాల్ పెట్రోల్ పై దేశంలో అందరిపై వాడి స్టడీ చేస్తున్నామని వచ్చే సంవత్సరం ఫలితాలు వస్తాయంటూ పేర్కొంది. ప్రస్తుతానికైతే ఈ20 పెట్రోల్ వల్ల చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications