IT News: చెల్లాచెదురైన టెక్కీల ప్లాన్స్.. TCS, Wipro, Infosys షాకింగ్ డేటా..!!
IT News: మింగ మెతుకుంటే చాలు అనే ఒక ఫేమస్ పాట ప్రస్తుతం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సమానంగా వర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. గడచిన ఏడాది కాలంగా మారిపోయిన అంతర్జాతీయ పరిస్థితులు అన్ని వర్గాలు, వ్యాపారాలు చేస్తున్న వారిని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
నిన్నటి లాగా రేపు ఉండదు అనేది కాలం నేర్పిన పాఠం. ప్రస్తుతం టెక్ ఉద్యోగుల విషయంలోనూ ఇదే నిజమైనట్లు కనిపిస్తోంది. ఏడాది క్రితం వరకు మంచి జీతం, కంపెనీ బెనిఫిట్స్, జాయినింగ్ బోనస్ అంటూ రకరకాల మెుత్తంగా ఆఫర్లతో చాలా మంది తక్కువ కాలంలోనే ఎక్కువ కంపెనీలకు మారుతుండేవారు. దీంతో కంపెనీల్లోని మానవ వనరుల(HR) విభాగం అవసరం మేరకు సకాలంలో ఉద్యోగులను నియమించుకోవటం కోసం నానా తంటాలు పడేవి.

వాస్తవానికి కరోనా మహమ్మారి సమయంలో ఈ సమస్య పీక్స్ కి వెళ్లింది. అధిక ఉద్యోగ అవకాశాలు తక్కువ మంది నిపుణులు అందుబాటులో ఉండటంతో చాలా మంది ఆఫర్లను బట్టి కంపెనీలను మారుతూపోయారు. మరికొందరైతే దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా రెండు మూడు కంపెనీలకు ఏకకాలంలో పనిచేస్తూ చివరికి యాజమాన్యాలకు దొరికిపోయారు. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరం 2021-22లో దేశంలోని టాప్ 4 ఐటీ సేవల కంపెనీ ఉద్యోగుల నమోదు దాదాపు మూడు రెట్లు పెరిగి 2.4 లక్షల మంది ఉద్యోగులకు చేరుకుంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో TCS ఒక్కటే లక్ష మందికి ఉపాధి కల్పించింది. ఆ కాలంలో ఉద్యోగి టర్నోవర్ రేటు అధికంగా ఉంది. ఈ రేటు మరింత పెరుగుతుందన్న అంచనాతో పెద్ద టెక్ కంపెనీలు వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. అయితే అకస్మాత్తుగా వచ్చిని రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ ఆర్థిక మాంద్యం టెక్ కంపెనీల కలలను చెల్లాచెదురు చేశాయి. దీంతో ప్రాజెక్టులు తగ్గిపోవటంతో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల నియామకాలను నిలిపివేశాయి. పైగా ఎక్కువ మంది బెంచ్ పై కొనసాగుతున్నారు. అనేక ప్రపంచ స్థాయి కంపెనీలు లక్షల మంది ఉద్యోగులను నిర్థాక్షణ్యంగా ఇళ్లకు పంపేశాయి.
ఇటీవలి త్రైమాసికాల్లో కొన్ని కంపెనీలు మొత్తం ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారినే ఆన్ బోర్డు చేయకుండా అనేక నెలల నుంచి కంపెనీలు వారిని వేచి ఉండేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల కారణంగానే.. పారిశ్రామిక వృద్ధి మందగించడంతో ఉద్యోగుల అట్రిషన్ రేటు బాగా తగ్గిందని కార్పొరేట్ అట్రిషన్ రేటు తగ్గుదల గురించి ఐటీ గ్రోత్ కన్సల్టెన్సీ కాటలిన్క్స్ భాగస్వామి రామ్‌కుమార్ రామమూర్తి పేర్కొన్నారు. గతాన్ని పరిశీలిస్తే దేశంలోని కొన్ని ఐటీ కంపెనీల్లో 8 త్రైమాసికాల్లో ఉద్యోగుల టర్నోవర్ 25 నుంచి 40 శాతంగా నమోదైంది. అంటే దాదాపు 40-50 శాతం మంది ఉద్యోగులు కంపెనీలు మారారు. దీంతో కంపెనీలు సైతం అప్రమత్తం అయ్యాయి. ప్రస్తుతం ఇలా జీతాల పెంపు కోసం కంపెనీలు మారుతున్న ఉద్యోగుల ధోరణిని అరికట్టేందుకు వారికి ఆఫర్ చేస్తున్న హైక్స్ భారీగా తగ్గిస్తున్నాయి.


Click it and Unblock the Notifications