కరోనా మహమ్మారి వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఐటీ రంగంపై పరోక్షంగా ఎక్కువ ప్రభావం చూపింది. ఐటీ కంపెనీల క్లయింట్స్‌కు డిమాండ్ లేక, ఖర్చులు తగ్గించుకునే తదితర అంశాలు సాఫ్టువేర్ రంగంపై ప్రభావం చూపాయి. ఇప్పటికే వేతనాలు పెంచకపోవడం లేదా కొంతమంది ఉద్యోగులను తొలగించిన సందర్భాలు కూడూ ఉన్నాయి. ప్రాజెక్టులు లేక ఉద్యోగులను బెంచ్ పైన కూర్చుండబెట్టారు. ఐటీ సర్వీసెస్ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తమ ఉద్యోగులను బెంచీకి పరిమితం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందట. క్లయింట్స్ ప్రాజెక్టులు క్యాన్సిల్ చేయడం లేదా ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేస్తుండటంతో ఐటీ కంపెనీలుతమ ఉద్యోగులను బెంచీలకు పరిమితం చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

ఐటీ సంస్థల లాభాలపై ప్రభావం
ప్రాజెక్టులు క్యాన్సిల్ కావడం, కొత్త ప్రాజెక్టులు తగ్గిపోవడం, క్లయింట్స్ వాయిదా వేయడం వంటి వివిధ కారణాలతో ఉద్యోగులు బెంచీకి పరిమితం కావడంతో ఐటీ కంపెనీల లాభాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టులు అప్పగించని ఉద్యోగులను బెంచీకి పరిమితం చేయడం అంటారు. ఇది సంవత్సరం క్రితానికి పూర్తి భిన్నంగా ఉంది. సాఫ్టువేర్ సేవల ఎగుమతిదారులు డిజిటల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో సేవా డిమాండ్ తీర్చడానికి తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని నిర్వహించే వ్యూహం వల్ల బెంచీకి పరిమితమయ్యే వారు లేకపోవడం లేదా తక్కువగా ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు కరోనా కారణంగా ప్రాజెక్టుల ఆలస్యం, రద్దు ప్రభావం పడింది.

ఉద్యోగుల రక్షణ...
కొత్త ప్రాజెక్టులపై తిరిగి పనిచేసేందుకు ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్లు ఐటీ కంపెనీలు వెల్లడిస్తున్నాయట. అందుబాటులోని, కొత్తగా వస్తున్న ప్రాజెక్టుల అవకాశాలను అందిపుచ్చుకొని, డిమాండ్ తీర్చడానికి శిక్షణ పొందిన టాలెంట్‌ను వినియోగించుకుంటామని చెబుతున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగులను కాపాడుకోవడం తమ ప్రాధాన్యత అని విప్రో సహా వివిధ ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. కొన్ని ప్రాజెక్టుల రద్దు లేదా ఆలస్యం వల్ల కొంతమంది ఉద్యోగులు బెంచీ పైకి వెళ్లారని, అయితే క్రమంగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నట్లు చెబుతున్నాయి.

ఉద్యోగుల వినియయ రేటు
ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ట్రైనీలు మినహాయించి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల వినియోగ రేటు 81.2 శాతంగా ఉంది. ఇది అంతకుముందు క్వార్టర్‌లో 83.5 శాతంగా ఉంది. బెంచీకి పరిమితయ్యే వారి సంఖ్య పెరుగుతోందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. అయితే రానున్న కాలంలో ఐటీ సంస్థలకు ఎక్కువ ప్రాజెక్టులు వస్తాయని దిగ్గజ కంపెనీలు భావిస్తున్నాయి. అమెరికాలో త్వరలో ఎన్నికలు ఉన్నాయని, ప్రస్తుతం మందగమనం కనిపించినా పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications