IT News: కొత్త చట్టంతో ఐటీ ఉద్యోగాలు కన్నడికులకేనా..? ఇది ఏపీలో ఐటీ వృద్ధికి సదవకాశమా..?
Karnataka Job Reservations: కర్ణాటకలో ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లును తీసుకురావటం ఐటీ రంగంలో ప్రస్తుతం పెను భూకంపాన్ని సృష్టిస్తోంది. చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం ఐటీలో ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకలో పనిచేస్తున్నారు. ప్రధానంగా ఏపీ, తెలంగాణ నుంచి ఐటీ నిపుణులు అక్కడి చట్టంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ సిలికాన్ వ్యాలీగా ఐటీ రంగానికి బెంగళూరు నగరం పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నీటి ఎద్దడి సమస్యతో ఐటీ కంపెనీలు ఇతర నగరాలకు విస్తరించాలని చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్ చట్టం ఐటీ కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరలిపోయేలా చేస్తుందనే ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ మాజీ సీఈవో మోహన్ దాస్ పై స్పందిస్తూ ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాల రిజర్వేషన్ బిల్లు చట్టవిరుద్ధమైని వ్యాఖ్యానించారు. అయితే కంపెనీలు భవిష్యత్తు పరిస్థితులు, తలెత్తే సమస్యలపై బాగా ఆలోచించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లే అవకాశాలను వినియోగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దీనికి ముందు ఈ వేసవిలో బెంగళూరు నగరం భారీ నీటి కొరతను చూడగా ఆ సమయంలో కేరళ ప్రభుత్వం ఐటీ కంపెనీలు తమ రాష్ట్రంలో క్యాంపస్‌లను ఓపెన్ చేస్తే ప్రోత్సాహకాలను అందించటంతో పాటు నీటి సమస్యలు లేకుండా చూస్తామని ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలను వృద్ధి కోసం ప్రయత్నాలు వేగవంతం చేసిన ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. గతంలో ఐటీ కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చి నగరాన్ని ఐటీ హబ్ గా మార్చిన పరిచయాలు, అనుభవం ప్రస్తుతం వినియోగించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అనంతపురం జిల్లా దీనివల్ల లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తోంది.
వాస్తవానికి బెంగళూరు ఆర్థిక వ్యవస్థలో ఐటీ, స్టార్టప్ రంగం ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరంలో ఎక్కువగా ఐటీ రంగంలో జాబ్స్ చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాస ఉద్యోగులు ఉన్నారు. వీరు తరలివెళ్లాల్సిన పరిస్థితులు వస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థకు ఆదాయం రూపంలో భారీ నష్టాన్ని చూసే అవకాశం ఉంది. ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగుల మదిలో ఉన్న ప్రశ్న తమ ఉద్యోగాలు ఉంటాయా? లేక ఊడతాయా? అన్నదే. ఈ సమస్యలను అధిగమించేందుకు బెంగళూరు ఐటీ, టెక్ సర్వీస్ కంపెనీలు, స్టార్టప్‌లు సమీప నగరాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరుకు దక్షిణాన హోసూరు, అనంతపురం ఐటీ హబ్‌గా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications