Hyderabad News: బెంగళూరు సమస్యే హైదరాబాదులో.. టెక్కీల ఆందోళన..!!
Tech News: ప్రస్తుతం ఇండియాలో ఐటీ రంగం అనగానే ప్రధానంగా గుర్తొస్తున్న నగరాలు బెంగళూరు, హైదరాబాద్. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టెక్కీలు సైతం ఎక్కువగా ఈ రెండు లొకేషన్లలోనే ఉద్యోగం చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారని మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రెండు నగరాల్లోనూ వారిని ఒక సమస్య పెద్ద ఆందోళనకు గురిచేస్తోంది.
అదేంటంటే.. బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లోనూ ఇంటి అద్దెలు పెరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అభివృద్ధి మాటున ఈ నగరాల్లో ప్రజలు నివసించలేని స్థాయిలకు ఇంటి అద్దెలు చేరుకున్నాయి. వస్తున్న ఆదాయంలో దాదాపు ఒక వంతు ఇంటి అద్దెలకు వెచ్చించాల్సి వస్తోందని టెక్కీలు వాపోతున్నారు. ప్రస్తుతం దిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో స్థిరాస్తి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని టెక్ సిటీ అయిన బెంగళూరులో ఇంటి అద్దెలు గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. సాధారణ పనులు చేసుకునే వ్యక్తులకు ఈనగరంలో ఇంటి అద్దె చెల్లించటం సవాలుగా మారిందని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం హైదరాబాదు నగరాన్ని వెంచాడుతోందని తేలింది.

ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరగడంతో హైదరాబాద్‌కు పనుల నిమిత్తం వస్తున్న ప్రజలు ఇళ్లు అద్దెలను యజమానులు విపరీతంగా పెంచేస్తున్నారు. ఈ క్రమంలో కేవలం రెండు పడక గదుల ఇంటి అద్దె రూ.50 వేలకు చేరుకుందని ఐటీ ఉద్యోగి రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. అతను తన స్నేహితుడితో కలిసి కొండాపూర్ ప్రాంతంలో రెండు పడక గదుల ఇంటి కోసం గత నెల రోజులుగా వెతుకుతున్నానని చెప్పాడు. ఈ ప్రాంతంలో ఇంటి అద్దె రూ.50 వేలకు అదనంగా, యజమానులు అధనంగా మెయింటెనెన్స్ కూడా వసూలు చేస్తున్నారు. అలాగే అధిక డిమాండ్ కారణంగా అద్దెకు నివాసాలు దొరకటం లేదని చాలా మంది చెబుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ లో అద్దెకు ఇల్లు దొరకడం పెద్ద సమస్యగా మారిందని టెక్కీలు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో ఇళ్లు పొందడంలో ఉన్న సమస్యలను పలువురు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అవివాహిత, యువకులు తమకు అద్దె ఇల్లు దొరకడం లేదని, ఇచ్చినా అద్దె చాలా ఎక్కువైందని, భరించలేని పరిస్థితి నెలకొందంటున్నారు. ఇంటి అద్దె పెరిగితే ఇవ్వాల్సిన బ్రోకరేజ్ కమిషన్ సొమ్ము కూడా పెరిగిపోయిందని చెబుతున్నారు. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత ప్రస్తుతం అనేక కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశించిన తరుణంగా బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఇళ్ల అద్దెలు 30 నుంచి 50 శాతం పెరిగాయి. ఇంటి అద్దె ఎక్కువగా ఉండడంతో పాటుగా సొంత ఇల్లు కొనడం కూడా ప్రస్తుతం ఉన్న అధిక ధరలతో అసాధ్యంగా మారిపోయిందని వాపోతున్నారు.


Click it and Unblock the Notifications