Layoff News: 2024లో వేగం పెరిగిన తొలగింపులు.. గంటల్లో పోతున్న టెక్ ఉద్యోగాలు..
2024 Layoffs: కొత్త ఏడాది ప్రారంభమై నెలరోజులు కూడా గడవక ముందరే టెక్ ఉద్యోగుల గుండెల్లో లేఆఫ్స్ గుబులు నిద్రలేకుండా చేస్తోంది. జనవరి 1 నుంచి 23 వరకు పరిస్థితులు దారుణంగా దిగజారినట్లు వెల్లడైంది.
2024 జనవరి మాసంలో సగటున రోజుకు 900 మంది టెక్కీలు తమ ఉద్యోగాలను కోల్పోతున్నట్లు నివేదిక సంచలనంగా మారింది. కొత్త ఉద్యోగాల కోసం వెతుకున్న ప్రజలకు ఇది నిజంగా చేదు వార్తని చెప్పుకోవాలి. అమెరికాలోని దిగ్గజ కంపెనీలైన గూగుల్, అమెజాన్, హెచ్ పితో పాటు దేశీయ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో త్రైమాసిక ఫలితాలు సైతం తగ్గుతున్న ఉద్యోగుల సంఖ్యను హైలైట్ చేస్తున్నాయి.

వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఫ్రెషర్లు, కొత్త ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్నవారికి పూర్తిగా ప్రతికూలంగా ఉంది. వేల సంఖ్యలో ఉద్యోగులను కంపెనీలు తొలగించి వారి స్థానాన్ని వీలున్నంత మేరకు ఏఐతో భర్తీ చేస్తున్నాయి. Layoffs.fyi లెక్కల ప్రకారం 63 టెక్ కంపెనీలు కేవలం ఒక్క జనవరి నెలలోనే దాదాపు 10,963 మంది ఉద్యోగులను తొలగించాయని వెల్లడైంది. ఇదే క్రమంలో trueup.io డేటాను పరిశీలిస్తే.. 2024లో ఇప్పటివరకు టెక్ కంపెనీల్లో 22,016 మంది వ్యక్తులు ప్రభావితమయ్యారని తేలింది. జనవరిలో నేటి వరకు టెక్నాలజీ విభాగంలో రోజుకు 957 మంది ఉద్యోగాలు కోల్పోయారని ట్రాకర్ వెల్లడించింది.
2023 డిసెంబర్ 16,945 మంది, నవంబర్‌లో 16,875 మంది ఉద్యోగాల కోతలతో పోలిస్తే జనవరి 2024లో ఉద్యోగుల తొలగింపులు పెరిగాయని Trueup డేటా హైలైట్ చేసింది. కరోనా తర్వాత ఫేస్‌బుక్ 22,000, అమెజాన్ 19,000, గూగుల్ 12,000, మైక్రోసాఫ్ట్ 22,000 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసినట్లు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం వెల్లడైంది. దేశంలోని పెద్ద టెక్ కంపెనీలు సైతం తప్పని పరిస్థితుల్లో మాత్రమే కొత్త నియామకాలను చేస్తున్నట్లు చెబుతున్నాయి. వెళ్లిపోతున్న ఉద్యోగుల స్థానాల్లో కొత్త వారిని నియమించుకోవటాన్ని ప్రస్తుతానికి నిలిపివేశాయి. అలా డిసెంబర్ త్రైమాసికంలో మూడు భారతీయ ఐటీ దిగ్గజాలు 16,254 మంది ఉద్యోగులను విడిచిపెట్టాయి.


Click it and Unblock the Notifications