IT News: ఆస్ట్రేలియాలో స్టూడెంట్‌కు IT శాఖ షాక్.. 133 కోట్ల మేర నోటీసులు.. అసలేం జరిగిందంటే..
Pancard News: ఓ వ్యక్తికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు మోసగాళ్ల చేతిలో పడితే ఏమవుతుందో రోజూ వార్తల్లో వింటూనే ఉన్నాం. ముఖ్యంగా పాన్ కార్డు విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయపుపన్ను శాఖ ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఏమాత్రం డౌట్ వచ్చినా ఇంటికి నోటీసులు పంపుతుంది. కాబట్టి పాన్ కార్డుని అత్యవసరమైన చోట తప్ప మరి ఎక్కడా ఇవ్వవద్దని హెచ్చరిస్తున్నారు.
ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియా వెళ్లిన గుర్గావ్ యువకుడికి ఆదాయపు పన్ను శాఖ గట్టి షాక్ ఇచ్చింది. 8.1 లక్షల మేరు లావాదేవీలను టాక్స్ ఫైలింగ్ లో చూపలేదంటూ నోటీసు పంపించింది. దీంతో కంగుతిన్న ఆ స్టూడెంట్ తండ్రి పుష్పిందర్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడి పాన్ కార్డును ఎవరో అక్రమంగా వినియోగించారంటూ ఫిర్యాదు చేశారు. IT విభాగం నుంచి నోటీసులు అందుకున్న తర్వాతే తమకు ఈ విషయం తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఇదే తరహా నోటీసు వచ్చినట్లు సింగ్ తెలిపారు. GST రిటర్న్స్ కింద 133.8 కోట్ల విలువైన అమ్మకాలు నమోదయ్యాయని అందులో పేర్కొన్నట్లు చెప్పారు. వాటికి తన కుమారుడు మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ లావాదేవీలు FY21 కు సంబంధించినవన్నారు. ఆ సమయంలో సదరు స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నట్లు తండ్రి స్పష్టం చేశారు. తమ ధ్రువపత్రాలను దుర్వినియోగం చేశారని, దీనిపై విచారణ జరపాల్సిందిగా కోరారు.
ఈ దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగానికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మోసం, ఫోర్జరీ, నకిలీ పత్రాలు వినియోగం వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఏదేమైనా పాన్ కార్డు వంటి కీలక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు. విద్యావంతులే ఎక్కువగా ఈ తరహా మోసాల బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications