IT notice: IT శాఖ నుంచి ఈ నోటీసు వచ్చిందా? డోంట్ వర్రీ.. ఆదాయపు పన్ను శాఖదే పొరపాటు!
IT notice: పన్ను మినహాయింపులు పొందేందుకు పలువురు అడ్డదారులు తొక్కుతున్నారని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. దీంతో రిటర్నులను క్షుణ్ణంగా పరిశీలించి, తప్పుడు క్లెయిమ్స్ కు పాల్పడిన వారికి నోటీసులు పంపించింది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ IT శాఖ X(గతంలో ట్విట్టర్)లో చేసిన ట్వీట్‌తో.. ఒక్కసారిగా అందరికీ షాక్ తగిలినట్లయింది.
సెక్షన్ 80P కింద ట్యాక్స్ మినహాయింపులు తప్పుగా క్లెయిమ్ చేసినందుకు ఆయా వ్యక్తులకు ఆదాయపు పన్ను శాఖ పెద్ద ఎత్తున నోటీసులు జారీచేసింది. ఇది జరిగిన చాలా రోజుల తర్వాత అవి పొరపాటున పంపించామని చెప్పి IT విభాగం షాక్ ఇచ్చింది. ఈ మేరకు చార్టర్డ్ అకౌంటెంట్ నీరవ్ చోక్సీ లేవనెత్తిన ఓ ప్రశ్నకు ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చింది.

'పార్టనర్‌షిప్ సంస్థలకు సంబంధించిన రిటర్న్స్ లో తప్పులు దొర్లుతున్నాయి. సెక్షన్ 80P ఆయా సంస్థలకు వర్తించదు. వీటికి సంబంధించిన ప్రశ్నలకు వెంటనే స్పందించి, సరిదిద్దడానికి ప్రయత్నించాలి'అని చోక్సీ సెప్టెంబర్ 1న ట్వీట్ చేశారు.
అందుకు ఆదాయపు పన్ను శాఖ స్పందిస్తూ.. షెడ్యూల్ 80Pలోని సెక్షన్ 80P(2)(e) మినహాయింపుకు సంబంధించి తప్పుగా నోటీసులు పంపినట్లు అంగీకరించింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని, దీనికి సంబంధించిన మెయిల్ కమ్యూనికేషన్ త్వరలోనే పంపిస్తామని IT విభాగం పేర్కొంది.
ఇన్‌కం ట్యాక్స్ రిటర్నుల ఇ-వెరిఫికేషన్ గడువు ఆగస్టు 31తో ముగిసింది. ఆ తర్వాత వందలాది ట్యాక్స్ పేయర్స్ ఈ నోటీసులు అందుకున్నారు. వారు కాస్తా ట్యాక్స్ కన్సల్టెంట్స్ ను సంప్రదించడంతో ఇది బయటకు వచ్చింది. అర్హత లేని తగ్గింపులు క్లెయిమ్ చేశారంటూ IT శాఖ ఈ నోటీసులు పంపించింది. కానీ ఈ మినహాయింపులు వ్యక్తులకు కాక పార్టనర్ షిప్ సంస్థల కోసం ఉద్దేశించబడినవి కావడంతో ఇప్పుడు తప్పు తెలుసుకుంది.


Click it and Unblock the Notifications