IT News: ఉద్యోగుల తొలగింపులు తగ్గిస్తున్న టెక్ కంపెనీలు.. కానీ ఆ విషయంలో మాత్రం మారలే..!!
IT News: మెుదటి త్రైమాసికం చివరి నాటికి ఐటీ కంపెనీల్లో ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ముందరే చాలా కంపెనీలు తమ ఉద్యోగుల కోతలను అమలును పూర్తి చేశాయి. దీంతో లేఆఫ్స్ ప్రస్తుతానికి నెమ్మదించాయి.
ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన టెక్కీలు అవసరమయ్యే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై కంపెనీలకు ఆసక్తి పెరిగినప్పటికీ.. గత ఏడాది భారీ తొలగింపుల తర్వాత టెక్ కంపెనీలు ఇంకా నియామకాలను వేగవంతం చేయలేదు. జూన్, జూలై మాసాల్లో టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు తగ్గుదలను నమోదు చేశాయి. ఆగస్టులో అవి మరింతగా మందగించాయి. ప్రధానంగా ఆర్థిక మాంద్యం కారణంగా ఖర్చులు తగ్గించుకునేందుకు సిబ్బంది తొలగింపులను కంపెనీలు ఎంచుకున్నాయి.

ఈ సంవత్సరం ఇప్పటి వరకు టెక్ పరిశ్రమలో మెుత్తంగా 3,42,671 తొలగింపులు జరిగాయి. ఇది గత సంవత్సరం నమోదైన 2,43,075 తొలగింపుల కంటే అధికం. ప్రస్తుతం టెక్ రంగంలో ఓపెన్ జాబ్స్ సంఖ్య తక్కువగానే ఉంది. ఐటీ ఉద్యోగులకు డిమాండ్ తక్కువగానే ఉన్నట్లు పరిశ్రమ ధోరణి తెలియజేస్తోంది. ఏప్రిల్ 2021 నుంచి అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయని వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీలు ఉన్న ఉద్యోగులను తొలగించటానికి ఇష్టపడటం లేరని తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న మార్కెట్ అవసరాల దృష్యా ఏఐ ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురవుతున్న తక్కువ స్కిల్ ఉన్న ఉద్యోగులు తమనుతాము అప్ స్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని జెఫరీస్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఐటీ సేవల కంపెనీల క్లైంట్స్ ఎక్కువ జాగ్రత్తగా, ఖర్చులను తగ్గించుకునే ధోరణిని కొనసాగిస్తున్న తరుణంలో కంపెనీలు ఆదాయ అంచనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాయని వెల్లడైంది.


Click it and Unblock the Notifications