Tech companies cheating: పలు కంపెనీలు లేదా పని ప్రాంతాల్లో శ్రమ దోపిడీ అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఓ వ్యక్తి నుంచి పొందిన సేవలకుగాను తక్కువ వేతనం చెల్లించబడటమే దీనర్థం. గతంలో దేశంలోని పలు రాజకీయ పార్టీలు శ్రమదోపిడికి వ్యతిరేకంగా గళం వినిపించాయి. క్రమంగా ఈ తరహా పరిస్థితులు కనుమరుగు అవుతూ వస్తున్నాయని సంతోషించాము. అయితే MNC మరియు IT కంపెనీల ముసుగులో స్టార్టప్స్ మొదలుకొని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సైతం ఇదే పద్ధతిని ఫాలో అవుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఓ ఉద్యోగి ఏదైనా IT కంపెనీలో చేరితే మొదటగా పూర్తి చేయాల్సిన పని సంస్థ పాలసీలను చదివి అర్థం చేసుకోవడం. ఉద్యోగులపై ఏ విధంగానూ వివక్ష చూపమని సదరు సంస్థ కచ్చితంగా పేర్కొంటుంది. కానీ నిజ జీవితంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. 'టీమ్ లీజ్ డిజిటల్' అనే సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెళ్లడైంది. ముఖ్యంగా జీతభత్యాల విషయంలో లింగ సమానత్వానికి పలు కంపెనీలు తూట్లు పొడుస్తున్నాయనే కఠోర సత్యం బయటపడింది.భారతీయ IT రంగంలో వేతనాల పరంగా లింగ వ్యత్యాసం ప్రమాదకర స్థాయికి చేరినట్లు టీమ్ లీజ్ ప్రకటించింది. కొన్ని డిమాండ్ ఉన్న ఉద్యోగాల విషయంలో అయితే ఇది ఏకంగా 22 నుంచి 30 శాతం వరకు విస్తరించి ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రోడక్ట్ మేనేజర్, డేటా సైంటిస్ట్, ఫుల్ స్టాక్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్ వంటి రోల్స్ లో ఈ వ్యత్యాసం విస్తృతంగా ఉన్నట్లు తెలిపింది. సాధారణ రోల్స్‌లో కూడా 10-17 శాతం మేర జీతభత్యాల్లో తేడాలు కనిపిస్తున్నట్లు చెప్పింది.

మహిళలు ఉన్నత స్థానాలకు ఎదిగే క్రమంలో సరైన మెంటల్ షిప్ లేకపోవడం, ప్రమోషన్ అవకాశాలు తక్కువగా ఉండటంతో ఈ స్థాయిలో వ్యత్యాసం తలెత్తుతున్నట్లు టీమ్ లీజ్ గుర్తించింది. పలు అంతర్జాతీయ కంపెనీలకు సంబంధించిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCC) క్రమంగా దేశంలో విస్తరిస్తున్నాయి. 2027 నాటికి వీటిలో మహిళా సాంకేతిక నిపుణుల శాతం 35 శాతం వరకు ఉండవచ్చనే అంచనాలున్నాయి.
భారత్ లో ఇప్పటికే 1,600 GCCలు 1.66 మిలియన్ల నిపుణులను నియమించుకున్నాయి. 6 ఏళ్లలో మరో 800 ఇండియాకు వస్తాయని, తద్వారా ప్రపంచ టెక్ హబ్‌గా భారత్ సత్తా చాటుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో లింగం ఆధారంగా వేతన వ్యత్యాసం కూడా అదే స్థాయిలో పెరిగితే రానున్న రోజుల్లో మహిళలకు ప్రాధాన్యత తగ్గుతూ పోతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications