జీతం ₹82 కోట్లా! దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఐటీ సీఈఓ ఎవరో తెలుసా?
భారతీయ ఐటీ రంగంలో ఏ కంపెనీ ఎక్కువ లాభాలు సంపాదిస్తే, ఆ కంపెనీ సీఈఓకే అత్యధిక జీతం ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ, ప్రాక్టికల్‌గా స్టాక్ మార్కెట్ (Stock Market) లెక్కలు, కంపెనీల రూల్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆర్థిక సంవత్సరం 2026 (FY26) వార్షిక నివేదికల ప్రకారం.. దేశంలోనే అతిపెద్ద ఐటీ ఎగుమతిదారుగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నిలిచింది. అత్యధిక రెవెన్యూ, లాభాలు సాధించినా కూడా.. సీఈఓ జీతం విషయానికి వచ్చేసరికి టీసీఎస్ అందరికంటే వెనుకబడిపోయింది.

మరోవైపు ఇన్ఫోసిస్ (Infosys) సీఈఓ సలీల్ పరేఖ్ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే ఐటీ బాస్‌గా రికార్డు సృష్టించారు. అగ్రశ్రేణి ఐటీ కంపెనీల సీఈఓల జీతాల వివరాలు ఇప్పుడు చూద్దాం
- సలీల్ పరేఖ్ (ఇన్ఫోసిస్ సీఈఓ): ఈయన FY26 లో ఏకంగా ₹82.6 కోట్ల భారీ ప్యాకేజీని అందుకుని మొదటి స్థానంలో నిలిచారు.
- శ్రీనివాస్ పల్లియా (విప్రో సీఈఓ): విప్రో కంపెనీ పరిమాణంలో చిన్నదైనా, ఈయన ₹49.6 కోట్ల జీతంతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.
- కె. కృతివాసన్ (టీసీఎస్ సీఈఓ): దేశంలోనే నెంబర్ వన్ ఐటీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ, ఈయనకు దక్కింది ₹28 కోట్లు మాత్రమే.
సలీల్ పరేఖ్‌కు అన్ని కోట్లు ఎలా వచ్చాయి?
ఇన్ఫోసిస్ బాస్ సలీల్ పరేఖ్ జీతం టీసీఎస్ సీఈఓ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఈయన బేసిక్ జీతం ₹7.97 కోట్లు, వేరియబుల్ పే ₹8.5 కోట్లు మాత్రమే. కానీ, ఆయనకు లభించిన స్టాక్ ఆధారిత ప్రోత్సాహకాలు (Stock-linked rewards) , షేర్లను విక్రయించడం ద్వారా వచ్చిన లాభాలు ఏకంగా ₹50.75 కోట్లు. అంటే స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఇచ్చే షేర్ల వల్లే ఆయన జీతం ఈ రేంజ్‌కు చేరింది.
కంపెనీల లాభాలు.. ఒకసారి లెక్కలు చూస్తే!
సీఈఓల జీతాలకు, కంపెనీల పర్ఫార్మెన్స్‌కు అస్సలు సంబంధం లేదనే విషయం ఈ కింది వివరాలు చూస్తే అర్థమవుతుంది.
- టీసీఎస్: FY26 లో ₹2.67 లక్షల కోట్ల ఆదాయంతో, ₹49,210 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
- ఇన్ఫోసిస్: ₹1.79... లక్షల కోట్ల రెవెన్యూ సాధించి, ₹29,440 కోట్ల ప్రాఫిట్ నమోదు చేసింది.
- విప్రో: కేవలం ₹92,620 కోట్ల ఆదాయం, ₹13,200 కోట్ల నెట్ ప్రాఫిట్ మాత్రమే సాధించింది.
అయినప్పటికీ విప్రో సీఈఓ, టీసీఎస్ సీఈఓ కంటే ఎక్కువ సంపాదించడం విశేషం. విప్రో ఈ ఏడాది ఏకంగా 7.8 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్స్ సాధించడంతో సీఈఓకు మంచి ఇన్సెంటివ్స్ దక్కాయి.
రూపాయి కూడా తీసుకోని దిగ్గజాలు
ఒకపక్క సీఈఓలు కోట్ల రూపాయల ప్యాకేజీలు అందుకుంటుంటే, మరోపక్క ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నుండి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. అలాగే టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కూడా టీసీఎస్ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోకుండా, కేవలం మీటింగులకు హాజరైనందుకు ఇచ్చే సిట్టింగ్ ఫీజ్ ₹4.2 లక్షలు మాత్రమే తీసుకున్నారు.
చివరగా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు గమనించాల్సింది ఏంటంటే.. కార్పొరేట్ ప్రపంచంలో కంపెనీ సైజును బట్టి కాకుండా, ఎగ్జిక్యూటివ్ కాంపెన్సేషన్ స్ట్రక్చర్ (జీతాల ఒప్పందాలు) ఎలా ఉంది అనే దానిపైనే సీఈఓల సంపాదన ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications