Ambani Vs Tata: ఉచితాలు, తక్కువ ధరలు వంటి ఆఫర్లతో కస్టమర్లను కొల్లగొట్టడం అంబానీకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు యాజమాన్యా బాధ్యతలు చేపట్టిన వారసులు సైతం అవే ప్లాన్స్ ప్రత్యర్థి కంపెనీలను ఓడించేందుకు వాడేస్తున్నారు. ఇషా అంబానీ ఏకంగా టాటాలతోటే పోటీకి సై అంటూ కాలు దువ్వుతున్నారు. ఇందుకోసం హైదరాబాదును మెుదటి ఎంపికగా ఎంచుకున్నారు.
ప్రస్తుతం ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో యువతకు తక్కువ ధరలో మంచి ఫ్యాషన్ దుస్తులను అందిస్తున్న టాటా జూడియోకు పోటీగా రిలయన్స్ నుంచి యూస్టాను ఆమె తీసుకొచ్చారు. తాజాగా హైదరాబాదులోని శరత్ సిటీ మాల్‌లో తమ మొదటి షాప్ ప్రారంభమైంది. రిటైల్ ఫ్యాషన్ వ్యాపారంలో యువతకు చేరువయ్యేందుకు దీనిని లాంచ్ చేసినట్లు తెలుస్తోంది.

బడ్జెట్ ధరల్లో యువతకు అద్భుతమైన ఫ్యాషన్‌ను Yousta ఆధునిక సాంకేతికతతో కూడిన రిటైల్ లేఅవుట్‌లు అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఇక్కడ అత్యల్పంగా రూ.499 నుంచి వివిధ వస్తువులను విక్రయిస్తున్నారు. ప్రధానంగా 15-25 ఏళ్ల మధ్య యువత మార్కెట్ టార్గెట్ చేస్తూ ఈ స్టోర్ల ఏర్పాటు జరుగుతోంది. కంపెనీ మారుతున్న యువత ఫ్యాషన్ కోరికలను అర్థం చేసుకోవడానికి వారితో కలిసి పని చేస్తూనే ఉంటుందని రిలయన్స్ రిటైల్, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ప్రెసిడెంట్, CEO అఖిలేష్ ప్రసాద్ తెలిపారు.
అధునాతన సౌకర్యాలతో కూడిన Yousta స్టోర్లలో కస్టమర్లు తమకు అవసరం లేని దుస్తులను విరాళంగా అందించవచ్చని కంపెనీ వెల్లడించింది. వీటికి లాభాపేక్ష లేని సంస్థలతో కమ్యూనిటీ ప్రాజెక్టులకు వినిగించేందుకు అందజేస్తామని వెల్లడించింది. హైదరాబాద్ లోని స్టోర్ ఏర్పాటుతో పాటు ఆన్‌లైన్‌లో Ajio, JioMart ద్వారా కూడా వినియోగదారులు వీటిని కొనుగోలు చేయెుచ్చని కంపెనీ తెలిపింది. వీటికి తోడు కంపెనీ Azorte బ్రాండ్‌తో కూడిన ప్రీమియం ఫాస్ట్-ఫ్యాషన్ స్టోర్‌లు, Tira పేరుతో ప్రీమియం కాస్మెటిక్స్ స్టోర్‌లను ఏర్పాటు చేస్తూ దేశంలోని యువ కస్టమర్లకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. అలా టాటా జూడియో, పాంటలూన్స్ వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications