Isha Ambani: దూకుడు పెంచిన ఇషా అంబానీ.. ఫ్యాషన్ వ్యాపారంలో భారీ డీల్..
Reliance MOU with ASOS: దేశంలోని వ్యాపార దిగ్గజం రిలయన్స్ గ్రూప్ యాజమాన్య బాధ్యతలను ముఖేష్ అంబానీ వారసుల చేతికి అప్పగించారు. దీంతో ఇషా అంబానీ చేతికి రిలయన్స్ రిటైల్ పగ్గాలు అందాయి. ఆమె రాకతర్వాత కొత్త కంపెనీల కొనుగోలు, పనితీరు మెరుగుపరచటం వంటి చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
తాజాగా రిలయన్స్ రిటైల్ ప్రముఖ బ్రిటిష్ ఫ్యాషన్ కంపెనీతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో బ్రిటిష్ ఆన్‌లైన్ ఫ్యాషన్ కంపెనీ అసోస్(ASOS) రిలయన్స్ రిటైల్ ద్వారా భారతదేశంలో ఉత్పత్తులను విక్రయించనుంది. రెండు కంపెనీల మధ్య జరిగిన తాజా ఒప్పందం ఆధారంగా.. రిలయన్స్ రిటైల్ దేశంలో అసోస్ ఫ్యాషన్ ఉత్పత్తులను ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ మోడ్‌లలో విక్రయించనుంది. తాజా డీల్ ద్వారా అసోస్ ఉత్పత్తులు ఇప్పుడు ప్రత్యేకించి రిలయన్స్ గ్రూప్‌లోని ప్రత్యేక దుకాణాలు, స్టోర్‌లలో, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించబడతాయి.

దీంతో ఫ్యాషన్ ప్రియులు యూకే కంపెనీకి చెందిన ఉత్పత్తులను నేరుగా రిలయన్స్ రిటైల్ ద్వారా దేశంలో కొనుగోలు చేయవచ్చు. తొలిసారిగా భారతీయ కంపెనీతో అసోస్ ఇలాంటి ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకోవటం గమనార్హం. అంతర్జాతీయ కంపెనీల ఉత్పత్తులను భారత్‌లో విక్రయించడంతోపాటు ప్రతి ఒక్కరూ సులువుగా కొనుగోలు చేసే ప్లాట్‌ఫామ్‌పై ఉంచాలనే లక్ష్యంతో తాజా డీల్ జరిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అసోస్ డిజైన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ బ్రాండ్ అయిన అసోస్ ఇండియాలో రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో తమ ఉత్పత్తుల విక్రయంపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోస్ ఆంటోనియో అమోస్ సంతోషం వ్యక్తం చేశారు.
డెలాయిట్ గ్లోబల్ పవర్స్ ప్రకారం రిలయన్స్ రిటైల్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీగా కొనసాగుతోంది. రిలయన్స్ రిటైల్ కంపెనీ 2006లో రిలయన్స్ గ్రూప్ కింద ప్రారంభించబడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ భారతదేశంలో దాదాపు 249 మిలియన్ల రిజిస్టర్డ్ కస్టమర్లను కలిగి ఉంది. ఇది కిరాణా, ఎలక్ట్రానిక్స్, దుస్తులు మొదలైన వివిధ రంగాల్లో స్థిరపడింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.2,60,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే 2023 మార్చితో ముగిసిన త్రైమాసిక కాలానికి రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా దాదాపు 7,000 నగరాల్లో 18,040 స్టోర్‌లను ఏర్పాటు చేసింది.


Click it and Unblock the Notifications