బంగారం ధరలు రూ. లక్షకు పడిపోతాయా.. కొనుగోలుకు అదే సరైన సమయమా.. నిపుణులు ఏమంటున్నారంటే..
బంగారం ధరలు ప్రస్తుతం గరిష్ట స్థాయిలను తాకుతున్నాయి. ఈ సమయంలో కొనుగోలు చేయాలా లేక ధర మరింత తగ్గే వరకు వేచి చూడాలా అనే సందేహం ఈ సంవత్సరం ప్రతి కొనుగోలుదారుడిలోనూ వ్యక్తమవుతోంది. ఈ ప్రశ్నకు ఆర్థిక విశ్లేషకులు ఇస్తున్నసమాధానం ఏమిటంటే.. మార్కెట్‌లో బంగారం ధర ఎప్పుడు అత్యంత కనిష్ట స్థాయికి చేరుతుందో ఖచ్చితంగా అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి.. సరైన సమయం కోసం వేచి చూడటం ప్రయోజనకరం కాదని చెబుతున్నారు.
చారిత్రాత్మకంగా పరిశీలిస్తే భారతదేశంలో ఏప్రిల్ 2025 వరకు 10 గ్రాముల Gold ధరలు స్థిరంగా రూ. 1 లక్ష కంటే తక్కువగానే ఉండేవి. అయితే జూలై 24 నాటికి 10 గ్రాముల Gold ధర రూ. 1,43,000 మార్కును దాటి రికార్డు స్థాయిలో ట్రేడ్ అయింది. పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పౌరులను కొనుగోళ్లు తగ్గించుకోవాలని సూచించినప్పటికీ.. మార్కెట్ పుంజుకుంటూనే వచ్చింది.

మరోవైపు బంగారం ధర తిరిగి రూ. 1 లక్ష స్థాయికి పడిపోవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతుండటంతో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజలు ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం ద్రవ్యోల్బణాన్ని పెంచడంతో ప్రజలు తమ నిత్యవసరాల కోసం డబ్బు ఆదా చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో బంగారం ధర తీవ్రంగా పడిపోయే అవకాశం ఉందా లేదా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ రెనిషా చైనాణి విశ్లేషణ ప్రకారం.. బంగారం ధర సమీప భవిష్యత్తులో రూ. 1 లక్షకు పడిపోవడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం ధరలకు బలమైన మద్దతును ఇస్తోంది. అందువల్ల రూ. 1 లక్షకు ధర పడిపోవడం అనేది కేవలం ఒక ఊహాజనిత విపరీతమైన ముప్పు (టెయిల్-రిస్క్) మాత్రమే తప్ప, సాధారణ అంచనా (బేస్ కేస్) కానే కాదని ఆమె స్పష్టం చేశారు.
ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడ్ ధరలు పెరగడం బంగారం ధరలను గరిష్టాల్లోనే ఉంచింది. బలమైన అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వల్ల కొద్దిపాటి దిద్దుబాటు వచ్చినప్పటికీ.. 2026 వరకు బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1.4 లక్షల నుండి రూ. 1.5 లక్షల స్థాయిలోనే కొనసాగుతాయని అంచనా. మార్కెట్‌లో జరిగే 5 నుండి 15 శాతం స్వల్పకాలిక తగ్గుదలలు సాధారణమైన సమతుల్యత మాత్రమే తప్ప.. మార్కెట్ పతనానికి అవి సూచికలు కావు. అందువల్ల ఆందోళనతో అమ్మకాలు లేదా కొనుగోళ్లు చేయకుండా క్రమబద్ధమైన పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం ధరలు రూ. 1 లక్ష స్థాయికి పడిపోవాలంటే అంతర్జాతీయంగా అనేక భారీ ఆర్థిక మార్పులు సంభవించాల్సి ఉంటుంది. డాలర్ విపరీతంగా బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వేగంగా పెంచడం లేదా ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ పూర్తిగా పడిపోవడం వంటివి జరిగితేనే ఇది సాధ్యమవుతుంది.
బొనాంజా సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ అభిప్రాయం ప్రకారం.. ధరలు లక్ష రూపాయలకు పడిపోవడాన్ని పూర్తిగా కొట్టిపారేయలేకపోయినా.. అది తక్షణమే జరిగే పరిణామం కాదు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి సురక్షిత ఆస్తులకు డిమాండ్ తగ్గడం, దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు కొనసాగడం, వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లు తగ్గించడం, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం వంటి స్థూల ఆర్థిక మార్పులు సంభవించినప్పుడు మాత్రమే అటువంటి పెద్ద దిద్దుబాటు జరుగుతుందన్నారు.
దీర్ఘకాలికంగా ఆలోచించే పెట్టుబడిదారులకు మార్కెట్‌లో వచ్చే ప్రతి ముఖ్యమైన దిద్దుబాటు లేదా ధరల తగ్గుదల అనేది మార్కెట్ నుండి బయటకు రావడానికి కారణం కాకూడదు. అది క్రమంగా కొనుగోలు చేయడానికి ఒక మంచి అవకాశంగా భావించాలి. బంగారం చారిత్రక చక్రాలను బట్టి 10 నుండి 20 శాతం దిద్దుబాటు జరగడం సాధారణ విషయమే కాబట్టి, స్వల్పకాలిక మదుపరులు మార్కెట్‌లో ఉండే అస్థిరతకు సిద్ధపడి తమ పొజిషన్లను జాగ్రత్తగా నిర్వహించుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
