Gold Price: తులం బంగారం రూ.2 లక్షలకు చేరుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..!
బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. గత వారం, పది రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది. ఇప్పుడు ఇంకా పసిడి ధర పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే స్థానిక పరిస్థితులే కాక అంతర్జాతీయ పరిస్థితులు బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం మార్కెట్ అంచనా వేసిన ప్రకారం రావడంతో.. పసిడి ధరలు పుంజుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు పుత్తడిపై పెట్టుబడులు పెంచుతున్నారని చెబుతున్నారు.
బంగారం ఔన్సుకు 4,300 డాలర్లకు పైగా ట్రేడవుతోంది. ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికా జూలై వినియోగదారుల ధరల సూచీ జూలైలో 0.1 శాతం పెరిగింది. జూలై గణాంకాలు మార్కెట్ అంచనా వేసిన విధంగా రావడంతో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే లేదా స్థిరంగా ఉండే పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డాలరు బలహీనపడడం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.

డాలర్‌లో ధర నిర్ణయించే బంగారం ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు చౌకగా మారడంతో బంగారం కొనుగోళ్లు పెరిగాయని వివరిస్తున్నారు. దీంతో స్పాట్ గోల్డ్ 100 రోజుల మూవింగ్ యావరేజ్ పైకి పెరిగిందని పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయంగా కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల తులం బంగార ధర రూ. 270 పెరిగి రూ.1,55,130కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పిసిడి ధర రూ.250 పెరిగి రూ. 1,42,200 పలుకుతుంది. ఇక తులం 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.210 పెరిగి రూ.1,16,350 కి చేరింది.
సెప్టెంబర్‌లో ఫెడ్ నిర్ణయంపై అందరి దృష్టి ఉంది. జూలై 29న జరిగిన సమావేశంలో అమెరికా కేంద్ర బ్యాంకు బెంచ్‌మార్క్ పాలసీ రేటును 3.50%-3.75% పరిధిలోనే ఉంచింది. అయితే ముగ్గురు ఫెడ్ అధికారులు రేటు పెంపునకు అనుకూలంగా ఓటు వేయడం ద్రవ్యోల్బణంపై ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియాలో బంగారం ధర అధికంగా ఉండడానికి దిగుమతి సుంకం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం పసిడిపై దిగుమతి సుంకం 15 శాతం విధిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధర పెరుగుతోంది. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి వైపు మల్లుతున్నారు. అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టడంతో ధరలు పెరుగుతున్నాయి. ఈ ధోరణి ఇంకా కొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే బంగారం రూ. 2 లక్షలకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications