Lockdown: సమ్మర్‌లో లాక్‌డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని తన ప్రసంగంలో కరోనా మహమ్మారి (Pandemic) నాటి పరిస్థితులను ప్రస్తావించడంతో, మళ్ళీ దేశంలో లాక్ డౌన్ (Lockdown) విధిస్తారా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
ప్రధాని మోదీ తన తాజా ప్రసంగంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలను వివరిస్తూ.. కరోనా సమయాన్ని గుర్తు చేశారు. అయితే ఇది జబ్బుల గురించి కాదు, ఆర్థిక వ్యవస్థ , సరఫరా వ్యవస్థ (Supply Chain) గురించి. మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా రవాణా ఎలాగైతే ఆగిపోయిందో, ఇప్పుడు యుద్ధం వల్ల అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో రవాణాకు ఆటంకం కలుగుతోందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా చమురు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని, అప్పట్లో లాగే ఇప్పుడు కూడా మనం స్వయం సమృద్ధిగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

వేసవిలో లాక్‌డౌన్ వచ్చే అవకాశం ఉందా?
అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి లేదు, కాబట్టి గతంలో లాగా ప్రజలను ఇళ్లకే పరిమితం చేసే లాక్ డౌన్ (Lockdown) విధించే అవకాశం లేదని, ప్రధాని మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యుద్ధం వల్ల వస్తువుల ధరలు పెరగవచ్చు. కానీ, జనజీవనం స్తంభించిపోయే పరిస్థితులు ప్రస్తుతం లేవని చెప్తున్నారు. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతూ.. గ్యాస్, పెట్రోల్ సరఫరాకు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తితే మాత్రం దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలాగే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశమూ లేకపోలేదు.
ఈ ఇబ్బందులు తప్పవు..
మహమ్మారి సమయంలో మనం ఎదుర్కొన్న సవాళ్లను ప్రధాని ఎందుకు గుర్తు చేశారంటే..
- ఇంధన ధరలు: భారత్ తన చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతుంది. యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకవచ్చు.
- వస్తువుల రవాణా: సముద్ర మార్గాల్లో దాడులు పెరిగితే ఎగుమతులు, దిగుమతులు నెమ్మదిస్తాయి. ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుంది.
- ఆర్థిక అనిశ్చితి: స్టాక్ మార్కెట్లు పడిపోవడం, రూపాయి విలువ తగ్గడం వంటివి జరగవచ్చు.
ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల వల్ల రవాణాలో కొంత జాప్యం జరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి, ధరలు పెంచే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. ప్రజలు కూడా ఇలాంటి సమయాల్లో వదంతులను నమ్మకుండా వాస్తవాలను గ్రహించాలి.
మనమేం చేయాలి?
ప్రస్తుతానికి లాక్‌డౌన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ, అంతర్జాతీయ పరిణామాల వల్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, అనవసర ఖర్చులను తగ్గించుకోవడం , పొదుపు చేయడం మంచిది. ప్రభుత్వం అందిస్తున్న అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి.


Click it and Unblock the Notifications