ఆలయాల్లోని బంగారాన్ని ప్రభుత్వం తీసుకోబోతుందా? సోషల్ మీడియా పోస్టుల్లో నిజమెంత?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అలాగే కొన్ని మీడియా సంస్థల్లో దేశంలోని ఆలయాలు, మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారానికి (Gold) సంబంధించి ఒక వార్త విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆలయాల గోల్డ్ రిజర్వ్స్‌ను టార్గెట్ చేస్తూ ఒక కొత్త 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' (Gold Monetisation Scheme) తీసుకురాబోతోందని, గుడులలో ఉన్న బంగారానికి బదులుగా గోల్డ్ బాండ్లను జారీ చేయాలని చూస్తోందంటూ కొన్ని వార్తలొస్తున్నాయి. ఇందులో నిజమెంతంటే..
భక్తులలో తీవ్ర గందరగోళానికి దారితీసిన ఈ వైరల్ క్లెయిమ్స్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Ministry of Finance) మంగళవారం స్పందించింది. ఈ వార్తలన్నీ ముమ్మాటికీ "అబద్ధం, నిరాధారం, ప్రజలను తప్పుదోవ పట్టించేవి" అని తేల్చి చెప్పింది.

ఆలయాల బంగారం 'స్ట్రాటజిక్ గోల్డ్ రిజర్వ్స్' కాబోతోందా?
ఈ వైరల్ ప్రచారంలో మరో షాకింగ్ అంశాన్ని కూడా జోడించారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల గోపురాలకు, గర్భగుడి తలుపులకు, ఇతర నిర్మాణాలకు అమర్చిన బంగారు పలకలను (Gold plates) ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. వాటిని భారతదేశపు "స్ట్రాటజిక్ గోల్డ్ రిజర్వ్స్" (Strategic Gold Reserves of India) గా పరిగణించబోతోందని కొందరు పోస్టులు పెట్టారు.
దీనిపై ఆర్థిక శాఖ తీవ్రంగా స్పందిస్తూ.. "గుడి గోపురాలు, తలుపులపై ఉన్న బంగారాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి పుకార్లను ప్రజలు నమ్మవద్దు, అలాగే ఇతరులకు షేర్ చేయవద్దు" అని హెచ్చరించింది. అన్-వెరిఫైడ్ సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు రేకెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
అధికారిక ప్రకటనలనే నమ్మండి!
ప్రభుత్వ విధానాలు లేదా స్కీమ్‌లకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా.. కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రెస్ రిలీజ్‌లు, వెబ్‌సైట్లు లేదా వెరిఫైడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది. అనధికారిక సోర్సెస్ నుండి వచ్చే మెసేజ్‌లను చూసి మోసపోవద్దని భక్తులకు, పౌరులకు సూచించింది.
మరో అంశంపై కూడా క్లారిటీ
ఇదే నెలలో భారతదేశపు టెక్స్‌టైల్ రీసైక్లింగ్ (టెక్స్‌టైల్ రికవరీ) రంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనాలను కూడా ప్రభుత్వం ఖండించింది. పానిపట్ వంటి ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలను మాత్రమే భూతద్దంలో చూపిస్తూ, భారత్ సాధిస్తున్న ప్రగతిని విదేశీ మీడియా విస్మరించిందని ప్రభుత్వం పేర్కొంది.
ఏది ఏమైనప్పటికీ.. గుడుల సంపద , హిందూ ఆలయాలకు సంబంధించిన బంగారం (Gold) పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త నియమ నిబంధనలను గానీ, బలవంతపు బాండ్ల విధానాన్ని గానీ తీసుకురావడం లేదని క్లియర్ కట్‌గా స్పష్టమయింది. సోషల్ మీడియా వేదికగా కొందరు కావాలనే ఇటువంటి సున్నితమైన విషయాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఫార్వార్డ్ చేయడం సైబర్ క్రైమ్ కిందకు వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ స్వయంగా రంగంలోకి దిగి అధికారికంగా ఈ వివరణ ఇవ్వడంతో.. గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠకు గురవుతున్న భక్తులు, వివిధ ఆలయాల ట్రస్టీలు, మతపెద్దలు ఇన్నాళ్లకు ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications