Anil Agarwal: వ్యాపార ప్రస్థానంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమిస్తూ విజయతీరానికి చేరిన ఘటికుడు అనిల్ అగర్వాల్. వేదాంత రిసోర్సెస్ పేరుతో మైనింగ్ వ్యాపారాలను నిర్వహిస్తూ ఇండియాతో పాటు నమీబియా, సౌత్ ఆఫ్రికా, లైబీరియాల్లో తన వ్యాపారాలను కలిగి ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయనను అప్పుల బాధలు చుట్టుముట్టాయి.
వేదాంత రిసోర్సెస్ కంపెనీ సైతం అదానీ గ్రూప్ మాదిరిగానే అప్పుల విషయంలో చాలా ఎక్కువ లెవరేజ్ పొందింది. దీంతో కంపెనీపై రుణాల భారం కొంత అధిక స్థాయిలకు చేరుకుంది. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అదానీపై సంచలన నివేదిక విడుదల చేసిన తర్వాత భారత రెగ్యులేటరీ సంస్థలు అప్పుల భారం ఎక్కువగా ఉన్న అగర్వాల్ వ్యాపారాలపై కూడా దృష్టి సారించాయి.

ఈ క్రమంలో కంపెనీకి దాదాపుగా 13 బిలియన్ డాలర్ల అప్పులు ఉన్నాయి. దీంతో వేదాంతను అప్పులు లేని కంపెనీగా మార్చాలని భావిస్తున్నట్లు ఈనెల ప్రారంభంలో అనిల్ అగర్వాల్ వెల్లడించారు. మరికొంత కాలంలో దీనిని సుసాధ్యం చేయగలనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో జూన్ లో చెల్లించాల్సిన 900 మిలియన్ డాలర్లకు సరిపోయే డబ్బు కలిగి ఉన్నట్లు వెల్లడించారు. పైగా రానున్న ఏడాది గ్రూప్ కంపెనీల ద్వారా 9 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందుతామని తెలిపారు.
అదానీ గ్రూప్ వార్తల ఒత్తిడి నేపథ్యంలో వేదాంత రెండు బిలియన్ డాలర్ల అప్పును తగ్గించుకుంది. గడచిన 11 నెలలుగా కంపెనీ దీనిని చెల్లించింది. అయితే ప్రస్తుతం కంపెనీకి మరో 7.7 బిలియన్ డాలర్ల మేర అప్పులు ఉన్నాయి. ఏప్రిల్ 2023 నాటికి వీటిలో 3 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. కంపెనీ అప్పుల చెల్లింపుల కోసం వేదాంతలో 5 శాతం వాటాలను అనిల్ అగర్వాల్ విక్రయించనున్నారంటూ బ్లూమ్ బర్గ్ ఒక నివేదికను విడుదల చేసింది. అయితే డబ్బు కోసం అది అంతిమ ప్రయత్నమని నివేదికలో వెల్లడించినప్పటికీ.. అలాంటి ఆలోచన తమకు లేదంటూ అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ కేవలం పుకార్లేనంటూ కొట్టిపాడేశారు.
కంపెనీలో 10 శాతాన్ని సంస్థాగత ఇన్వెస్టర్లకు వాటాలను విక్రయించి నిధులను సేకరించాలని ప్రయత్నిస్తున్నట్లు మూలాల ద్వారా తెలుస్తోంది. దీనికోసం కంపెనీ గల్ఫ్ సావరిన్ వెల్త్ ఫండ్స్, అబుదాబికి చెందిన ముబాదలా, ADQ, బహ్రెయిన్ ఇన్వెస్ట్‌కార్ప్ అండ్ సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF), అబుదాబికి చెందిన ది ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) వంటి ప్రత్యామ్నాయ ఇన్వెస్టర్లను సంప్రదించిందని సమాచారం. ప్రతికూల వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్ గత నెలలో 6.12 శాతం మేర క్షీణించింది.


Click it and Unblock the Notifications