Yen Carry Trade: 2007 ఆగస్టులో జరిగిందే నిన్న రిపీట్.. మరి మార్కెట్ల క్రాష్ ఉంటుందా?
Markets Crash: ప్రపంచ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేసిన రోజు ఆగస్టు 6, 2024. ఒక్కసారిగా గ్లోబల్ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగటంతో సూచీలు నేలకూలాయి. అమెరికా మార్కెట్ల నుంచి ఇండియా మార్కెట్ల వరకు అన్ని చోట్లా ప్రకంపనలతో సూచీలు చారిత్రాత్మకంగా సింగిల్ డే లాసెస్ నమోదు చేశాయి. అయితే ఇలాంటి పరిస్థితి 2008 జనవరిలో ఆర్థిక మాంద్యానికి ముందు 2007 ఆగస్టులో నమోదైంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ అంశంపైనే పడింది.
ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలోని ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్న అంశం Yen Carry Trade. అసలు ముందుగా నేటి తరం ఇన్వెస్టర్లలో చాలా మందికి దీనికి సంబంధించిన వివరాలు అస్సలు తెలియవు. అసలు ముందుగా యెస్ క్యారీ ట్రేడ్ గురించి తెలుసుకుందాం..

Yen Carry Trade:
వాస్తవానికి దీని మూలాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో 1980లలో ప్రారంభమయ్యాయి. ఇది జపాన్ కేంద్రంగా మెుదలైన ట్రేడింగ్ విధానం. అప్పట్లో జపాన్ స్టాక్ మార్కెట్లతో పాటు రియల్టీ బూమ్ చూసింది. ఆ సమయంలో వడ్డీ రేట్ల పెంపు మార్గాన్ని ఉపయోగించి వీటిని వేగవంతంగా జపాన్ సెంట్రల్ బ్యాంక్ అణచివేసింది. మాంద్యం పరిస్థితులు అక్కడ ఏర్పడకుండా నిరోధించింది. ఆ తర్వాత వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ పోయింది. ఒకానొక సమయంలో వడ్డీ రేట్లను జపనీస్ సెంట్రల్ బ్యాంక్ ఏకంగా 0 శాతానికి తగ్గించింది.
దీంతో అక్కడి ప్రజలు తమ డబ్బులు స్థానిక బ్యాంకుల్లో పెట్టుబడిగా పెట్టే పరిస్థితులు పోయాయి. దీంతో జపనీస్ మహిళలు తక్కువ వడ్డీకే జపనీస్ యెన్ కరెన్సీలో బ్యాంకుల నుంచి రుణాలను పొంది ఆ సొమ్మును డాలర్లుగా మార్చి అమెరికా, ఆసియా వంటి మార్కెట్లలో, బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు. దీనిని యెన్ క్యారీ ట్రేడ్ అని పిలిచేవారు. తర్వాత ఆ సొమ్మును జపాన్ కరెన్సీలోకి మార్చటంతో వారికి డబుల్ రాబడి వచ్చేది. తర్వాతి కాలంలో ఇదే ప్రణాళికను ప్రపంచంలోని అనేక దేశాల్లో అగ్ర ఆర్థిక సంస్థలు అవలంభించటం ప్రారంభించాయి. ఇది జపాన్ విదేశీ మారకంలో 30 శాతం కలిగి ఉండేది. ఈ ప్లాన్ ఎప్పటి వరకు పనిచేస్తుందంటే జపనీస్ కరెన్సీ యెన్ విలువ అమెరికన్ డాలర్ కంటే బలహీనపడుతున్నప్పుడు లేదా స్థిరంగా కొనసాగుతున్నప్పుడు మాత్రమే. దీనికి తోడు తాజాగా జపాన్ తాజాగా వడ్డీ రేట్లు పెంచటంతో పరిస్థితులు పూర్తిగా తలకిందులు అయ్యాయి.
2007 ఆగస్టులో జరిగింది ఇదే..
అయితే వాస్తవానికి 2008 జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలటానికి ముందు జపనీస్ యెన్ విలువ డాలర్ మారకంతో పోల్చినప్పుడు బలపడటంతో యెన్ కరెన్సీలో రుణాలు తీసుకుని Yen Carry Trade రూపంలో ఇన్వెస్ట్ చేసిన వారు తమ డబ్బును వెనక్కి తీసుకోవటం మెుదలుపెట్టారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. అయితే అమెరికాలో రియల్టీ బబుల్ పేలటంతో యెన్ కరెన్సీ మార్చి పెట్టుబడులు పెట్టిన అనేక మంది తమ డబ్బులు వెనక్కి తీసుకున్నారు. అప్పట్లో ఈ ధోరణి ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేసేసింది. నిన్న సేమ్ సీన్ గ్లోబల్ మార్కెట్లను గజగజలాడించింది.
ప్రస్తుత పరిస్థితి ఏంటి..?
వాస్తవానికి ప్రస్తుతం నిన్నటి పరిణామాల తర్వాత జపాన్ టోక్యో మార్కెట్లు ఏకంగా 10 శాతం తిరిగి పుంజుకోవటంతో భారతీయ స్టాక్ మార్కెట్లు దానికి అనుగుణంగా లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. చాలా మంది నిపుణులు ప్రస్తుత పతనం వ్యాల్యుయేషన్ వల్ల వచ్చిందిగా చెబుతున్నారు. అమెరికాలో మాంద్యం వచ్చే లాంటి పరిస్థితులు రావటానికి దాదాపు ఏడాది నుంచి రెండేళ్లు పడుతుందని వారు చెబుతున్నారు. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్లలో బుల్‌రన్ కొనసాగటానికి అవకాశాలు పుష్కలంగా మిగిలే ఉన్నాయని వారు చెబుతున్నారు. అయితే 2025 జనవరి నాటికి మళ్లీ 2008 సీన్ రిపీట్ అవుతుందా లేక అనలిస్టుల అంచనాలు నిజమవుతాయా అనే విషయం రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications