IRM Energy IPO Listing: మార్కెట్లలో నేడు అత్యంత ప్రతికూల వాతావరణం సమయంలో ఒక ఐపీవో అడుగుపెట్టింది. అరంగేట్రంతోనే ఇన్వెస్టర్ల ఆశలపై ఇది నీళ్లు చల్లింది.
ఇప్పుడు మనం తెలుసుకోబోంది ఐఆర్ఎమ్ ఎనర్జీ ఐపీవో గురించే. మార్కెట్ ప్రతికూలతల మధ్య ఐపీవో 5.5 శాతం డిస్కౌంట్ రేటు వద్ద ఎక్స్ఛేంజీల్లో జాబితా అయ్యింది. వాస్తవానికి కంపెనీ ఒక్కో షేరును రూ.505కి ఇష్యూ చేయగా.. ఎన్ఎస్ఈలో ఒక్కో షేరు రూ.477.25 రేటు వద్ద, బీఎస్ఈలో ఒక్కో స్టాక్ రూ.479 వద్ద లిస్ట్ అయ్యాయి. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి మెుత్తం రూ.545.40 కోట్లను సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.160 కోట్ల పెట్టుబడిని సేకరించింది.

ఐపీవో కోసం షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.480-505గా కంపెనీ నిర్ణయించింది. ఈ క్రమంలో దాదాపు 1.08 కోట్ల ఫ్రెష్ ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఐఆర్ఎమ్ ఒక పైప్డ్ న్యాచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. దీనికి గుజరాత్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో వ్యాపారం ఉంది. అక్టోబర్ నాటికి కంపెనీ 69 CNG ఫిల్లింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇందులో కంపెనీ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న రెండు CNG స్టేషన్‌లు, డీలర్లు నిర్వహిస్తున్న 36 స్టేషన్‌లు, 31 CNG స్టేషన్‌లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిర్వహణలో కొనసాగుతున్నాయి.
ఐపీవో ద్వారా వచ్చిన సొమ్ములో రూ.307.26 కోట్లను తమిళనాడులోని నామక్కల్, తిరుచిరాపల్లిలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ అభివృద్ధికి కంపెనీ వినియోగించాలని నిర్ణయించింది. అలాగే రూ.135 కోట్లను రుణ చెల్లింపుల కోసం వినియోగించాలని చూస్తోంది. ప్రస్తుతం ప్రమోటర్లు కంపెనీలో 67.94 శాతం వాటాను కలిగి ఉన్నారు. మెజారిటీ క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ (49.50 శాతం) కలిగి ఉంది. మిగిలిన వాటాలను IRM ట్రస్ట్ దాని మేనేజింగ్ ట్రస్టీ రాజీవ్ ఇంద్రవదన్ మోడీ హోల్డ్ చేస్తున్నారు. అలాగే జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.245.25 కోట్లుగా నమోదైంది.


Click it and Unblock the Notifications