IPO News: ప్రతిరోజూ రెండు నుంచి మూడు ఐపీవోలకు సంబంధించిన లిస్టింగ్, ఇష్యూ వార్తలు రావటం సర్వ సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలో చాలా కంపెనీల ఐపీవోలు ఇన్వెస్టర్లను తొలిరోజే ధనవంతులుగా మార్చేశాయి.
చాలా మంది ప్రస్తుతం ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టి లాభాలను పొందటం కంటే ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేసి లిస్టింగ్ గెయిన్స్ పొందాలని చూస్తున్నారు. అలాంటి వారు మరోసారి తమ డబ్బును పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధం చేసుకునే సమయం వచ్చేసింది. త్వరలో IRM ఎనర్జీ కంపెనీ ఐపీవో మార్కెట్లోకి రాబోతోంది. అక్టోబర్ 18, 2023న ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడింది. అక్టోబర్ 20 వరకు తెరిచి ఉంటుంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.480- రూ.505గా ప్రకటించింది. అయితే కంపెనీ షేర్లకు ఇప్పటికే గ్రే మార్కెట్‌లో అద్భుతమైన స్పందన వస్తోంది.

ఇన్వెస్టర్లు కంపెనీ ఐపీవోపై బులిష్ గా ఉన్నారు. దీంతో గ్రేమార్కెట్లో స్టాక్ ఐపీవోకి రాకముందురే రూ.105 ప్రీమియం ధర పలుకుతోంది. ఒకవేళ కంపెనీ షేర్లు రూ.505 ఎగువ ప్రైస్ బ్యాండ్ ధర వద్ద కేటాయించబడితే.. అవి రూ.610 వద్ద లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే తొలిరోజే ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.545.40 కోట్లను సమీకరిస్తోంది.
IRM ఎనర్జీ IPOలో షేర్ల కేటాయింపును 27 అక్టోబర్ 2023న ఖరారు చేయవచ్చు. అలాగే కంపెనీ షేర్లను అక్టోబర్ 31న మార్కెట్‌లో లిస్ట్ చేయవచ్చు. ఒక్కో లాటులో కంపెనీ 29 షేర్ల చొప్పున విక్రయిస్తోంది. అంటే లాట్ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు కనీసం రూ.14,645 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ వాటా 67.94 శాతంగా ఉంది. కంపెనీ షేర్లు NSE, BSEలలో లిస్టింగ్ చేయబడతాయి.


Click it and Unblock the Notifications