ఐకానిక్ మహారాజా లోగోకు ఎయిర్ ఇండియా గుడ్‌బై.. కొత్త డిజైన్, లోగో ఎలా ఉన్నాయంటే..
AirIndia Logo: ఏళ్లపాటు టాటా గ్రూపు చేతులమీదుగా గాల్లోకి ఎగిరిన విమానయాన సంస్థ కొంతకాలం పాటు ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తిరిగి మళ్లీ తిరిగి సొంత గూటికి వచ్చిన తర్వాత ఎయిర్ లైన్స్ లో పలు మార్పులు చేయడానికి టాటా గ్రూపు నిర్ణయించింది. ఈ రీబ్రాండింగ్ లో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది.
సాధారణంగా ఎయిర్ ఇండియా అనగానే మహారాజా సింబల్ గుర్తొస్తుంది. అయితే ప్రస్తుత రీబ్రాండింగ్ లో భాగంగా దాన్ని తొలగించినట్లు టాటా సన్స్ వెల్లడించింది. దాని స్థానంలో సాంప్రదాయ గోల్డెన్ కలర్ ఇండియన్ క్లాసిక్ విండోను తీసుకొచ్చినట్లు సంస్థ ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. హద్దుల్లేని అవకాశాలకు ఇది చిహ్నమని తెలిపారు.

ఎయిర్ ఇండియా కొత్త లోగోను 'ది విస్టా'గా పిలవనున్నట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఎయిర్‌లైన్ సాహసోపేతమైన, ఆశావాద దృష్టికి ఇది ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ ను సైతం పరిచయం చేశారు. ఇది చక్ర నమూనాతో కూడిన ముదురు ఎరుపు, పర్పుల్, బంగారు రంగులతో కలిసి ఉంది.
అత్యుత్తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీలను ఎయిర్ ఇండియా నిర్వహణలో వినియోగించనున్నట్లు టాటా సన్స్ ఛైర్మన్ వివరించారు. ప్రముఖంగా మానవ వనరులను అప్ గ్రేడ్ చేయడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు విమానాల పునరుద్ధరణ కోసం 400 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు ఎయిర్ ఇండియా CEO కాంబెల్ విల్సన్ తెలిపారు. మార్చి 2024 నాటికి వైడ్-బాడీ ఫ్లీట్‌లో 33 శాతం అప్‌గ్రేడ్ చేయడం తమ లక్ష్యమన్నారు.


Click it and Unblock the Notifications