Revised insurance rules: పాలసీదారుల ప్రయోజనార్థం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఓ మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది. పాలసీదారులు తమ హక్కులు తెలుసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బీమా కంపెనీలు పాటించాల్సిన నియమ నిబంధనలను సైతం ఇందులో క్షుణ్ణంగా పొందుపరిచింది.
అన్ని బీమా పాలసీలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో జారీ చేయాలి. ఇ-ఇన్సూరెన్స్ పాలసీలపై కస్టమర్ డిజిటల్ సంతకం చేయవచ్చు. వినియోగదారుల అభ్యర్థన మేరకు ఫిజికల్ పాలసీని పొందవచ్చు. బీమా సంస్థ ప్రతిపాదన ఫారమ్‌ను ఆమోదించిన 15 రోజులలోపు జీవిత బీమా పాలసీని జారీ చేయాలి. తాజా రూల్స్ ప్రకారం పాలసీ వెంటనే జారీ చేయగలిగితే తప్ప, ప్రతిపాదన ఫారమ్‌తో పాటు ప్రారంభ ప్రీమియంను సేకరించకూడదు.

బీమా పాలసీ డాక్యుమెంట్‌తో పాటు ఫ్రీ లుక్ వ్యవధిని తెలియజేసే కవరింగ్ లెటర్, ప్రతిపాదన ఫారమ్ కాపీ, బీమా ప్రయోజనాల కాపీ, కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్, నిర్దిష్ట ఉత్పత్తికి అవసరమైన ఇతర పత్రాలను పాలసీదారుడికి బీమా కంపెనీ అందించాలి. ఏడాది కంటే ఎక్కువ జీవిత బీమా పాలసీపై 30 రోజుల ఫ్రీ లుక్ వ్యవధిని ఉంటుంది. పాలసీ నిబంధనలతో కస్టమర్ సంతృప్తి చెందకపోతే ఆ గడువు లోపు దాన్ని రద్దు చేయడానికి అవకాశం ఉంది.
బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్ టైమ్‌లైన్లను IRDAI నిర్ణయించింది. దర్యాప్తు అవసరమైన మరణ క్లెయిమ్‌లు మినహా మిగిలిన వాటిని 15 రోజులలోపు పరిష్కరించాలి.
విచారణ అవసరమయ్యే డెత్ క్లెయిమ్‌లను 45 రోజులలోపు సెటిల్ చేయాలి. సరెండర్ లేదా పాక్షిక ఉపసంహరణ అభ్యర్థనలను 7 రోజులలోపు క్లియర్ చేయాలి. ఇక మెచ్యూరిటీ, సర్వైవల్ ప్రయోజనాలు, యాన్యుటీ చెల్లింపులు మరియు ఆదాయ ప్రయోజనాలను గడువు తేదీనే అందించాల్సి ఉంటుంది.
నిర్దిష్ట గడువులోపు క్లెయిమ్ పరిష్కరించబడనట్లయితే క్లెయిమ్‌దారుకు సమాచారం అందిన తేదీ నుండి చెల్లింపు తేదీ వరకు 2 శాతం అదనంగా బ్యాంక్ రేటుపై పాలసీదారులు వడ్డీకి అర్హులు. ఆ వడ్డీని సదరు బీమా సంస్థే క్లెయిమ్ మొత్తంతో పాటు చెల్లిస్తుంది. ప్రతిపాదన పత్రంలో నామినీ వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి.
నగదు రహిత ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను తప్పనిసరిగా 3 గంటలలోపు పరిష్కరించాలి. బీమా సంస్థలు ఈ అభ్యర్థనలను స్వీకరించిన ఒక గంటలోపు నిర్ణయం తీసుకోవాలి. ఆసుపత్రి నుంచి అభ్యర్థనను వచ్చిన 3 గంటలలోపు డిశ్చార్జ్ కోసం అప్రూవల్ ఇవ్వాలి. ఈ గడువు దాటితే ఆసుపత్రికి చెల్లించాల్సిన అదనపు ఛార్జీలకు బీమా సంస్థే బాధ్యత వహిస్తుంది.


Click it and Unblock the Notifications