Insurance rules change: కరోనా అనంతరం ఆరోగ్యం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఇందుకోసం బీమా తీసుకునే వారి సంఖ్య అంతకంతకూ వృద్ధి చెందుతోంది. వయసు పెరిగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కానీ 65 ఏళ్ల తర్వాత బీమా కొనుగోలు చేసే అవకాశం లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. దీనిపై తాజాగా నియంత్రణ సంస్థ కీలక ప్రకటన చేసింది.
ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి వయోపరిమితిని తొలగిస్తున్నట్లు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ప్రకటించింది. ఏప్రిల్ 1, 2024 నుండి ఇది అమలులోకి వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో వయసుతో సంబంధం లేకుడా ఎవరైనా ఆరోగ్య బీమా కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

'బీమా సంస్థలు అన్ని వయసుల వారికి ఆరోగ్య బీమా ఉత్పత్తులను అందజేయాలి. సీనియర్ సిటిజన్‌లు, విద్యార్థులు, పిల్లలు, ప్రసూతి మరియు కాంపిటెంట్ అథారిటీ ద్వారా నిర్దేశించిన ఏదైనా ఇతర గ్రూపుల కోసం ప్రత్యేకంగా ఉత్పత్తులను రూపొందించవచ్చు' అని IRDAI జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా మరింత సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను సృష్టించడమే దీని లక్ష్యమని తెలిపింది.
సీనియర్ సిటిజన్‌ల వంటి నిర్దిష్ట జనాభా కోసం రూపొందించిన పాలసీలను ప్రవేశపెట్టాలని ఆరోగ్య బీమా ప్రొవైడర్‌లను IRDAI ఆదేశించింది. వారి క్లెయిమ్‌లు మరియు ఫిర్యాదులను నిర్వహించడానికి ప్రత్యేక ఛానెళ్లను ఏర్పాటు చేయాలని కోరింది. నోటిఫికేషన్ తర్వాత క్యాన్సర్, గుండె లేదా మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్ రోగులకు పాలసీలు నిరాకరించడం కూడా నిషేధించబడింది.
ఆరోగ్య బీమా నిరీక్షణ వ్యవధిని 48 నుంచి 36 నెలలకు IRDAI తగ్గించింది. పాలసీదారు మొదట్లో వెల్లడించాడా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా 36 నెలల తర్వాత క్లెయిమ్ కవర్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. తద్వారా ముందుగానే ఉన్న అనారోగ్య కారణాల సాకుతో ఈ 36 నెలల తర్వాత క్లెయిమ్‌లను తిరస్కరించడం నుంచి ఆరోగ్య బీమా సంస్థలు నిషేధించబడ్డాయి.


Click it and Unblock the Notifications