IRDAI: బీమా పాలసీ ఫ్రీ-లుక్ వ్యవధిని పెంచాలని ప్రతిపాదించిన ఐఆర్డీఏఐ..
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) బీమా పాలసీ ఫ్రీ-లుక్ వ్యవధిని పెంచాలని ప్రతిపాదించింది. ఈ సమయంలో పాలసీదారులు పాలసీ కొనుగోలు చేసిన తర్వాత తమకు నచ్చని బీమా పాలసీలను తిరిగి ఇచ్చే సమయం 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచాలని సూచించింది. "ఏదైనా మోడ్ ద్వారా పొందిన పాలసీల కోసం ఫ్రీ-లుక్ పీరియడ్, పాలసీ డాక్యుమెంట్ అందిన తేదీ నుంచి 30 రోజులు ఉంటుంది" అని డ్రాఫ్ట్ ఐఆర్డీఏఐ నిబంధనలు 2024 పేర్కొంది.
ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు తప్పనిసరి ఫ్రీ-లుక్ పీరియడ్ 15 రోజులుగా ఉంది. అయితే ఎలక్ట్రానిక్ పాలసీలు, డిస్టెన్స్ మోడ్ ద్వారా పొందే పాలసీల విషయంలో ఇది 30 రోజులు వ్యవధి ఉంటుంది. ముఖ్యంగా ఫ్రీ-లుక్ పీరియడ్ అనేది పాలసీదారుని, పాలసీ పత్రాలను వివరంగా పరిశీలించిన తర్వాత, పాలసీ తనకు తప్పుగా అనిపిస్తే పాలసీని రద్దు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. పాలసీదారు పాలసీని వాపసు చేయాలని నిర్ణయించుకుంటే ఫ్రీ-లుక్ వ్యవధిలో వర్తించే దామాషా రిస్క్ ప్రీమియం మినహాయించి కొనుగోలు సమయంలో చెల్లించిన ప్రీమియంలను బీమా కంపెనీ వాపసు చేయాల్సి ఉంటుంది.

అంతేకాకుండా నామినేషన్ పొందితే తప్ప జీవిత బీమా పాలసీని జారీ చేయరాదని ముసాయిదా నిబంధనలు చెబుతున్నాయి. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు తాజా పాలసీలను జారీ చేసే సమయంలో, పునరుద్ధరణ సమయంలో కూడా నామినేషన్ పొందాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది.
డ్రాఫ్ట్ దాని ప్రస్తుత రూపంలో ఖరారు చేస్తే, చాలా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో మాత్రమే జారీ చేయడం తప్పనిసరి ఉంటుంది.
బీమా చేసిన మొత్తాలు రూ. 100 కంటే ఎక్కువ లేదా సింగిల్ లేదా వార్షిక ప్రీమియంలు రూ. 10 కంటే ఎక్కువగా ఉన్న పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో మాత్రమే జారీ చేయాల్సి ఉంటుందని ఐఆర్డీఏఐ పేర్కొంది. బీమా దరఖాస్తు డిజిటల్‌గా స్వీకరించబడిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా రీఫండ్ ఎలక్ట్రానిక్ బదిలీ, క్లెయిమ్‌ల చెల్లింపుల కోసం పాలసీదారుల బ్యాంక్ ఖాతా వివరాలను జారీ చేసే సమయంలో బీమా కంపెనీలు సేకరించేలా రెగ్యులేటర్ ప్రతిపాదించింది.


Click it and Unblock the Notifications