ముంబై: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) గుడ్‌న్యూస్ ఇచ్చింది. లక్షలాదిమందికి ప్రయోజనం కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా రెండు సంవత్సరాల కిందట రద్దయిన సౌకర్యాన్ని పునరుద్ధరించింది. ఇవ్వాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఐఆర్‌సీటీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.
రైళ్లల్లో ఆహార సరఫరాను పునరుద్ధరించింది ఐఆర్‌సీటీసీ. ప్యాంట్రీ కార్ సర్వీస్ ఉన్న అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లోనూ ఇవ్వాళ్టి నుంచి ఆహార సరఫరాను పునరుద్ధరించిట్లు తెలిపింది. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో- ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాజధాని, శతాబ్ది, దురంతో ప్రీమియంతో పాటు 428 రైళ్లల్లో గత సంవత్సరం డిసెంబర్‌లోనే ఆహార సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 శాతం రైలు సర్వీసుల్లో దీన్ని ఇదివరకే ప్రవేశపెట్టింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కుక్డ్ ఫుడ్ సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత రైలు సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ ఆహార సరఫరా విషయంలో సానుకూల నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. గత సంవత్సరం డిసెంబర్‌లో దీన్ని సడలించింది. 428 రైలు సర్వీసుల్లో దీన్ని పునఃప్రవేశపెట్టింది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఫుడ్ సప్లైని చేపట్టింది.
ఆ తరువాత ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడం, పైగా దీన్ని పునరుద్ధరించాలంటూ విజ్ఞప్తులు అందడం, కోవిడ్ తీవ్రత తగ్గిపోవడం వంటి పరిస్థితుల వల్ల మిగిలిన అన్ని రైళ్లల్లోనూ ఇవ్వాళ్టి నుంచి పునరుద్ధరించామని ఐఆర్‌సీటీసీ తెలిపింది. పెళ్లిళ్ల సీజన్ రాబోతోన్నందున..ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటుందనే అంచనా వేస్తున్నామని, దీనికి అనుగుణంగా అదనంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్యాంట్రీ కార్లను అమర్చే దిశగా చర్యలు తీసుకుంటామని వివరించింది.


Click it and Unblock the Notifications