IRCTC Q1 Results: భారతీయ రైల్వేలకు చెందిన సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. కంపెనీ తాజాగా తన జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దేశీయంగా రైల్వే రంగంలోని కంపెనీల్లో ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగిస్తున్న వేళ స్టాక్ తొలి త్రైమాసికంలో సూపర్ లాభాలను నమోదు చేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైమాసికంలో రూ.308 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ అధిక టిక్కెట్ అమ్మకాలతో క్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 33.3 శాతం లాభాల పెరిగుదలను చూసింది. ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 11.8 శాతం పెరిగి రూ.1,120.15 కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ కంపెనీ లాభాన్ని తొలి త్రైమాసికానికి రూ.306.5 కోట్లుగా, నికర ఆదాయం రూ.1,130.8 కోట్లుగా అంచనా వేసింది. ప్రస్తుత ఫలితాలు బ్రోకరేజ్ అంచనాలకు అనుకూలంగా ఉన్నాయి.

ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.73,340 కోట్లుగా ఉంది. అలాగే మార్కెట్ల ముగింపు నాటికి స్టాక్ ధర బీఎస్ఈలో ఒక్కోటి రూ.922.05 వద్ద స్థిరపడింది. గడచిన మూడు నెలల కాలంలో స్టాక్ ధర దాదాపు 8 శాతం పడిపోయింది. ఈ త్రైమాసికంలో EBITDAకి ముందు కంపెనీ ఆదాయాలు దాదాపు 30 శాతం వృద్ధితో రూ.428.55 కోట్లకు చేరుకున్నాయి. అలాగే EBITDA మార్జిన్ 33 శాతంతో పోలిస్తే మెరుగుపడి 38.3 శాతంగా నమోదైంది.
భారతదేశంలోని రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఆన్‌లైన్ రైల్వే టిక్కెట్లు, రైల్వేలకు క్యాటరింగ్ సేవలు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి భారత ప్రభుత్వంచే అధికారం పొందిన ఏకైక సంస్థ IRCTC. ఇది దేశవ్యాప్తంగా లగ్జరీ రైలు పర్యటనలు, హోటల్ బుకింగ్‌లు, హాలిడే ప్యాకేజీల వంటి విస్తృత శ్రేణి పర్యాటక, ఆతిథ్య సేవలను చేర్చడానికి సంస్థ తన సేవలను సంవత్సరాలుగా విస్తరించింది. కంపెనీ ప్రస్తుతం భారత ప్రభుత్వం 62.4 శాతం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు 7.1 శాతం, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు 10.5 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్నారు. అలాగే సాధారణ వాటాదారులు 20 శాతం కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications