అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - ఇరాన్ మధ్య సాగుతున్న దౌత్య యుద్ధం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇరాన్ ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు శాంతి దిశగా అడుగులు పడుతున్నాయనే ఆశలు రేకెత్తించినప్పటికీ.. టెహ్రాన్ నుండి వస్తున్న స్పందన మాత్రం అత్యంత కఠినంగా ఉంది. ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీకి సీనియర్ సైనిక సలహాదారుగా వ్యవహరిస్తున్న మొహ్సెన్ రెజాయీ చేసిన తాజా హెచ్చరికలు.. ఇరు దేశాల మధ్య ఉన్న అగాధాన్ని స్పష్టం చేస్తున్నాయి. అమెరికా కేవలం మాటలతో కాకుండా, ఆచరణలో తమ డిమాండ్లను నెరవేర్చే వరకు యుద్ధం ఆగదని ఆయన తేల్చి చెప్పారు.
ముఖ్యంగా Iran విధించిన షరతులు అమెరికాకు సవాలుగా మారాయి. గడిచిన కాలంలో తమ దేశం అనుభవించిన ఆర్థిక, ప్రాణ నష్టాలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని, అలాగే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అన్ని రకాల ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని రెజాయీ డిమాండ్ చేశారు. ఇవే కాకుండా భవిష్యత్తులో వాషింగ్టన్ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని అంతర్జాతీయ స్థాయిలో చట్టపరమైన హామీలు లభించే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన వాడిన భాష అత్యంత తీవ్రంగా ఉంది. గతంలో అనుసరించిన "కంటికి కన్ను" అనే ప్రతీకార తర్కం ఇప్పుడు సరిపోదని, ఈసారి శత్రువుల "కంటికి తల" తీస్తామంటూ హెచ్చరించడం టెహ్రాన్ యొక్క దూకుడు వైఖరిని ప్రతిబింబిస్తోంది. అంతేకాకుండా, అమెరికా దళాలు గల్ఫ్ ప్రాంతాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని ఆయన సూటిగా డిమాండ్ చేశారు.
ప్రస్తుత ఘర్షణ వాతావరణానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహునే ప్రధాన కారకుడని ఇరాన్ బలంగా నమ్ముతోంది. అమెరికా ఇప్పటికే యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, నెతన్యాహు ఒత్తిడి కారణంగానే కాల్పుల విరమణ సాధ్యం కావడం లేదని రెజాయీ ఆరోపించారు. యుద్ధం ప్రారంభమైన మొదటి దశలోనే విజయం సాధించడం అసాధ్యమని వాషింగ్టన్‌కు అర్థమైందని, కానీ మిత్రదేశాల ప్రయోజనాల కోసం బలవంతంగా పోరాటాన్ని కొనసాగిస్తోందని ఆయన విశ్లేషించారు. క్షేత్రస్థాయిలో ఇరాన్ సాయుధ దళాలు చాలా బలంగా ఉన్నాయని, శత్రువులను ఎదుర్కోవడానికి తమ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ మాత్రం చర్చల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని సూచనప్రాయంగా వెల్లడించారు. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ మరియు జారెడ్ కుష్నర్ వంటి కీలక వ్యక్తులు ఒక ఇరాన్ నాయకుడితో సంప్రదింపులు జరిపారని.. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. సుప్రీం లీడర్ ఖమేనీతో నేరుగా చర్చలు జరగలేదని స్పష్టం చేస్తూనే, ఏదో ఒక రూపంలో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ మొగ్గు చూపుతోందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా ఒకవైపు చర్చల సంకేతాలు, మరోవైపు యుద్ధ హెచ్చరికల మధ్య మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇరాన్ కోరుతున్న నష్టపరిహారం, ఆంక్షల ఉపశమనంపై అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైనే ఈ ప్రాంత భవిష్యత్తు ఆధారపడి ఉంది.


Click it and Unblock the Notifications