యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన.. అది సాధ్యం కాకుంటే అమెరికా అంతు తేలుస్తామని హెచ్చరిక..
అమెరికాతో సాగుతున్న దౌత్య ప్రయత్నాలు ఒకవేళ విఫలమైతే తాము యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ మంగళవారం నాడు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయితే తమ ప్రాధాన్యత ఎప్పుడూ చర్చలకే ముందుగా ఉంటుందని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. వాషింగ్టన్ -టెహ్రాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) అమలును ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాల ప్రతినిధులు ఖతార్‌లో వేర్వేరుగా భేటీ కావడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ నుండి ఈ కీలక ప్రకటన వెలువడింది.
ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ ప్రధాన సంధానకర్త అయిన మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ ఈ విషయాలను వెల్లడించారు. అమెరికాతో తాము చర్చలను కొనసాగిస్తామని స్పష్టం చేస్తూనే.. ఒకవేళ అవతలి పక్షం తమ కట్టుబాట్లను గౌరవించకపోతే సైనిక ఘర్షణకు వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. మేము చర్చలనే కోరుకుంటున్నాము, కానీ ఒకవేళ ఆ చర్చలు ఫలించకపోతే.. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. దానికి తగినట్లుగానే స్పందిస్తామని ఘాలిబాఫ్ నొక్కి చెప్పారు.

ఈ సందర్భంగా Iran అణు కార్యక్రమంపై దేశ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. దేశ అణు హక్కులు, తాము గీసుకున్న రెడ్ లైన్స్ (లక్ష్మణ రేఖలు) విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యకలాపాలన్నీ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పర్యవేక్షణలోనే.. అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) పరిధిలోనే జరుగుతున్నాయని వివరించారు. అణ్వస్త్ర సుసంపన్నతను ఇరాన్ తన హక్కుగా భావిస్తోందని, అమెరికా దురాగతాలకు వ్యతిరేకంగా, దేశ రక్షణకు ఇవి ఒక గ్యారెంటీ లాంటివని ఆయన అభివర్ణించారు. 2015 నాటి సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (JCPOA) ఒప్పందంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేస్తూ.. అంతర్జాతీయ హామీల విశ్వసనీయతపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్న ఘాలిబాఫ్.. లెబనాన్ సమస్య, చమురు ఎగుమతులు, హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం వంటి ఐదు కీలక నిబంధనలపై పూర్తిగా స్పష్టత వచ్చి, అవి ఖరారు అయ్యేంత వరకు ఇరాన్ ఒప్పందం అమలు తదుపరి దశకు వెళ్లదని స్పష్టం చేశారు. ఒప్పందంలోని మొదటి ఆర్టికల్ ప్రకారం లెబనాన్‌లో యుద్ధం ముగియాలని, ఎలాంటి సైనిక చర్యలు చేపట్టకూడదని, ప్రజలు తమ సొంత ప్రాంతాలకు తిరిగి రావాలని, లెబనాన్ సార్వభౌమాధికారం కాపాడబడాలని అమెరికా హామీ ఇస్తోందని, దీనిని సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి తాము కట్టుబడి ఉన్నామని, అమెరికా కూడా అలాగే చేయాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోపై ఘాలిబాఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్‌తో లెబనాన్ సంబంధాలను సాధారణీకరించడానికి రూబియో ప్రయత్నిస్తున్నారని, అటువంటి చర్యలు ప్రస్తుత అవగాహన ఒప్పందానికి పూర్తిగా విరుద్ధమని అన్నారు. రూబియో వాషింగ్టన్ మెమోరాండం ద్వారా అబ్రహం ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంటే.. తాము మాత్రం లెబనాన్ స్వాతంత్య్రాన్ని పరిరక్షించడానికి ప్రయత్నిస్తున్నామని ఆరోపించారు. అలాగే ఇరాన్ చమురు ఎగుమతుల గురించి మాట్లాడుతూ.. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత తాము 40 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును రవాణా చేశామని.. అయితే గత 50 నుండి 60 రోజులుగా ఒక్క బ్యారెల్ చమురు కూడా ఎగుమతి చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా ఖతార్ తన పాత్రను పునరుద్ఘాటించింది. అమెరికా-ఇరాన్ చర్చలలోని తాజా పరిణామాలను ఖతార్ విదేశాంగ మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీ.. అమెరికా రాయబారులైన స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో చర్చించినట్లు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం సఫలం కావడానికి అవసరమైన అన్ని రకాల చర్చలకు మద్దతు ఇవ్వడానికి ఖతార్ కట్టుబడి ఉందని స్పష్టం చేసినప్పటికీ.. ఈ చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications
