ఈ రోజుతో యుద్ధానికి పుల్ స్టాప్.. ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ సంచలన ప్రకటన.. టెహ్రాన్ రియాక్షన్ ఏంటంటే..
అంతర్జాతీయ రాజకీయ యవనికపై శని, ఆదివారాల్లో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు జూన్ 14వ తేదీ ఆదివారం నాడే ఒక చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా శనివారం ప్రకటించారు. ఈ ఒప్పందం పూర్తయిన వెంటనే ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధిని' (Strait of Hormuz) అందరి కోసం తిరిగి తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే, అమెరికా అధ్యక్షుడి ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించడమే కాకుండా.. ప్రస్తుతానికి అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
ఈ ప్రతిపాదిత ఒప్పందాన్ని 2015లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కుదిరిన 'జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్' (JCPOA) అణు ఒప్పందంతో ట్రంప్ పోల్చారు. ఒబామా హయాంలో జరిగిన ఒప్పందం ఇరాన్‌కు అణ్వాయుధాల తయారీ వైపు ఒక సులభమైన మార్గాన్ని చూపిందని, ఒకవేళ తాము దానిని రద్దు చేయకుంటే ఇరాన్ ఆరేళ్ల క్రితమే అణ్వాయుధాలను తయారు చేసి ఉపయోగించి ఉండేదని ట్రంప్ విమర్శించారు.

దానికి భిన్నంగా, ప్రస్తుతం తన నేతృత్వంలో జరుగుతున్న ఒప్పందం వల్ల ఇరాన్‌కు ఎలాంటి అణ్వాయుధాలు ఉండవనే పూర్తి హామీ లభిస్తుందని, వారు భవిష్యత్తులో కొనుగోలు లేదా తయారీ మార్గాల ద్వారా కూడా వాటిని సంపాదించలేరని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్మూలించామని, సరైన సమయం చూసి తమ అద్భుతమైన బి-2 (B-2) బాంబర్లు, సమర్థులైన పైలట్ల సహాయంతో పర్వతాల కింద పాతిపెట్టిన అణు పదార్థాన్ని వెలికితీసి, దానిని శుద్ధి చేసి ఇరాన్ లేదా అమెరికాలో ధ్వంసం చేస్తామని కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సైతం అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం రాబోయే 24 గంటల్లో ఖరారు కానుందని పేర్కొనడం విశేషం.
ట్రంప్ చేసిన ఈ ప్రకటనలను, ఆదివారం నాడే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయన్న వాదనలను ఇరాన్ పూర్తిగా తిరస్కరించింది. జూన్ 14వ తేదీన డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు ఉన్నందున, ఆయన తన యూఎఫ్‌సీ (UFC) వైట్ హౌస్ కార్యక్రమంతో పాటు దీనిని ఒక ఏకపక్ష "ప్రతీకాత్మక అవకాశం"గా మార్చుకుని. తన సొంత ప్రచారం కోసం వాడుకోవాలని చూస్తున్నారని ఇరాన్ గట్టిగా విమర్శించింది. ఇటువంటి మీడియా ఎత్తుగడలను తాము అనుమతించబోమని ఇరాన్ సంప్రదింపుల బృందం స్పష్టం చేసింది. ఇంకా అవగాహన ఒప్పందం (MOU) పూర్తిగా ఖరారు కాలేదని, అందువల్ల ఈరోజే సంతకాలు జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
అయినప్పటికీ, తెరవెనుక దౌత్య చర్చలు వేగంగా సాగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌లు ఒక అవగాహన ఒప్పందంపై ఎలక్ట్రానిక్‌గా సంతకం చేయడానికి ఒక వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం.. ఉభయ దేశాల మధ్య ప్రస్తుతమున్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించడం, అంతర్జాతీయ వాణిజ్యం కోసం హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, మరియు ఇరాన్ అణు కార్యక్రమంపై పునఃచర్చలు ప్రారంభించడం వంటి కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications
