హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..
అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఇరాన్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి కీలక సమాచారాన్ని అందించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో.. వ్యూహాత్మకమైన ఈ జలసంధిని తాము పూర్తిగా మూసివేయలేదని Iran స్పష్టం చేసింది. అయితే, కేవలం శత్రుత్వం లేని నౌకలకు మాత్రమే ఈ మార్గం ద్వారా ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అంతర్జాతీయ నౌకాయాన సంస్థకు పంపిన లేఖలో ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది.
నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించాలంటే ఇరాన్ అధికారులు విధించిన కొన్ని కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రతి నౌక తప్పనిసరిగా ఇరాన్ అధికారులతో ముందస్తుగా సమన్వయం చేసుకోవాలని, వారి అనుమతి లేనిదే ప్రవేశం ఉండదని టెహ్రాన్ నిబంధన విధించింది. ముఖ్యంగా ఇరాన్‌పై దాడుల్లో పాల్గొనే లేదా దాడులకు మద్దతు ఇచ్చే దేశాల నౌకలకు అనుమతి నిరాకరించబడింది. నౌకలు ప్రయాణించే సమయంలో ఇరాన్ ప్రకటించిన భద్రతా, రక్షణ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

ఈ లేఖలో ఇరాన్ ఒక విషయాన్ని అత్యంత స్పష్టంగా వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన లేదా ఆ దేశాలతో సంబంధం ఉన్న నౌకలను తాము "శత్రు నౌకలు"గా పరిగణిస్తామని పేర్కొంది. వీటితో పాటు ఇరాన్‌పై దాడులకు సహకరించే ఏ ఇతర దేశాల నౌకలకైనా తమ జలాల గుండా ప్రయాణం చేసే హక్కు ఉండదని టెహ్రాన్ హెచ్చరించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, జాతీయ భద్రతను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని ఇరాన్ తన లేఖలో ఘాటుగా స్పష్టం చేసింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువులో సుమారు ఐదవ వంతు ఈ హోర్ముజ్ జలసంధి గుండానే వెళుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణల వల్ల ఇప్పటికే ఇక్కడ నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడానికి, గ్లోబల్ సప్లై చైన్‌లో అంతరాయాలకు దారితీస్తోంది. ఇప్పటికే షిప్పింగ్ కంపెనీలు, బీమా సంస్థలు యుద్ధ ముప్పు కారణంగా ఈ మార్గంలో ప్రయాణించడానికి వెనుకాడుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. ఇరాన్ తన ప్రాదేశిక జలాల గుండా వెళ్లే నౌకలపై పూర్తి స్థాయి నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం, నౌకలు సురక్షిత ప్రయాణం కోసం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తోందని కూడా సమాచారం అందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యను పరిష్కరించడానికి తన రాయబార బృందంతో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతవరకు మేలు చేస్తుందో లేదా మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications