ట్రంప్ గాల్లో కోటలు కడుతున్నారు.. తీవ్రంగా ఎద్దేవా చేసిన ఇరాన్.. అమెరికా అధినేత ఇజ్జత్ మొత్తం తీసేసిన టెహ్రాన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. అమెరికాకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్న ఒక భారీ శాంతి ఒప్పందానికి తాము చేరువలో ఉన్నామని, ఈ డీల్ ఖరారైతే అమెరికా ప్రయోజనాలు ఊహించని రీతిలో పెరుగుతాయని ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా, ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించిందని, దీనివల్ల అమెరికాకు ఉచితంగా చమురు లభించడమే కాకుండా, వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛా రవాణాకు మార్గం సుగమం అవుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్ వేదికగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయనే సంకేతాలను పంపినప్పటికీ, ఇరాన్ మాత్రం దీనిని తీవ్రంగా తోసిపుచ్చింది.

ట్రంప్ చేసిన ఈ ప్రకటనలను ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ 'ఐఆర్‌ఐబీ' (Islamic Republic of Iran Broadcasting) తీవ్రంగా ఎద్దేవా చేసింది. ఆయన వాస్తవ పరిస్థితులను విస్మరించి గాల్లో కోటలు కడుతున్నారని మండిపడింది. ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఒక పర్షియన్ సామెతను ఉటంకించింది.
ఒంటె పత్తి గింజల గురించి కలలు కంటుంది.. కొన్నిసార్లు వాటిని ఒక్కసారిగా మింగేస్తున్నట్లు, మరికొన్నిసార్లు ఒక్కొక్కటిగా తింటున్నట్లు ఊహించుకుంటుంది" అంటూ ట్రంప్ ఆలోచనా ధోరణిని ఎగతాళి చేసింది. సాధ్యం కాని విషయాల గురించి అతిగా ఊహించుకునే వ్యక్తులను విమర్శించడానికి ఇరాన్‌లో ఈ సామెతను వాడుతుంటారు. గతంలో మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కూడా ట్రంప్‌ను ఉద్దేశించి ఇదే సామెతను వాడటం గమనార్హం.
ఈ పరిణామాల వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం కూడా అత్యంత కీలకమైనది. 2026 ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో యురేనియం విషయంలో తాము ఎలాంటి హామీలు ఇవ్వలేదని ఇరాన్ మీడియా స్పష్టం చేస్తోంది. ట్రంప్ తన రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి ఏకపక్ష ప్రకటనలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చల కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఒకవేళ ఒప్పందం కుదిరితే, పాకిస్థాన్‌లో జరగబోయే సంతకాల ప్రక్రియలో తాను స్వయంగా పాల్గొంటానని ట్రంప్ చెబుతున్నారు. అంతేకాకుండా, ఈ నెల 22తో ముగియనున్న కాల్పుల విరమణ గడువును పొడిగించేందుకు కూడా సిద్ధమని ఆయన సంకేతాలిచ్చారు. ఏది ఏమైనప్పటికీ, ట్రంప్ చెబుతున్నట్లుగా శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయా లేక ఇరాన్ చెబుతున్నట్లుగా ఇవన్నీ కేవలం అవాస్తవ ప్రచారాలా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం పశ్చిమాసియా రాజకీయ యవనికలో ఈ పరిణామాలు పెను మార్పులకు సూచికగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications