ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ రహస్య ఆపరేషన్.. సీక్వెల్ దిశగా పశ్చిమాసియా యుద్ధం..
ఇజ్రాయెల్, అమెరికాలతో జరిగిన ఇటీవలి ఉద్రిక్తతల అనంతరం ఇరాన్ తన సైనిక సామర్థ్యాలను వేగంగా పునరుద్ధరించుకుంటున్నట్లు తెలుస్తోంది. వారాల తరబడి సాగిన వైమానిక దాడుల ధాటికి దెబ్బతిన్న తన కీలకమైన భూగర్భ క్షిపణి స్థావరాలను టెహ్రాన్ తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుందని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'CNN' సమీక్షించిన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం.. ఇరాన్ పరిధిలోని 18 భూగర్భ క్షిపణి స్థావరాలలో దెబ్బతిన్న 69 సొరంగ ప్రవేశ ద్వారాలలో (Tunnel Entrances) ఇప్పటికే 50 క్షిపణి స్థావరాలను ఇరాన్ తిరిగి తెరిచింది. దాడుల వల్ల పేరుకుపోయిన శిథిలాలను తొలగించడానికి, దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించడానికి ఇరాన్ బుల్డోజర్లు, లోడర్లు, డంప్ ట్రక్కులతో విస్తృతమైన మరమ్మతు పనులను చేపట్టినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది.

ఇటీవలి సంఘర్షణ సమయంలో, ఇరాన్ యొక్క సుదూర క్షిపణి ప్రయోగ సామర్థ్యాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా వాటి సొరంగ ప్రవేశ ద్వారాలు, రవాణా మార్గాలు, లాంచ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తీవ్రమైన దాడులు జరిపాయి. అయితే, ఇరాన్ తన క్షిపణి నిల్వలను భూమికి చాలా అడుగుల లోతులో భద్రపరచడం వల్ల, అవి ఈ వైమానిక దాడుల నుండి సురక్షితంగా తట్టుకుని నిలిచాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత రెండు దశాబ్దాలుగా ఇరాన్ ఎలాంటి వైమానిక దాడులనైనా తట్టుకునేలా అత్యంత పటిష్టమైన, వ్యూహాత్మక భూగర్భ మౌలిక సదుపాయాలను నిర్మించుకుంది. ఈ సొరంగాల లోపల ఇరాన్ వద్ద ఇప్పటికీ సుమారు 1,000 బాలిస్టిక్ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని రక్షణ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తాజా పరిణామాలు ఎంతటి తీవ్రమైన దాడులు ఎదురైనా, తన కీలక సైనిక వ్యవస్థలను అతి తక్కువ సమయంలోనే పునరుద్ధరించుకోగల టెహ్రాన్ యొక్క వ్యూహాత్మక పట్టును నిరూపిస్తున్నాయి.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం ఒక కొలిక్కి వస్తుందని ఆశిస్తున్న తరుణంలో, ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలతో ఆ ప్రాంతం మళ్లీ దద్దరిల్లింది. ఇరాన్ తీరప్రాంతాలు, వ్యూహాత్మక ద్వీపాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు శని, ఆదివారాల్లో భారీ వైమానిక దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తున్న తమ 'MQ-1' డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడమే కాకుండా, నౌకాయానానికి ముప్పుగా మారేలా దుందుడుకు చర్యలకు పాల్పడిందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) 'X' (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. ఈ ముప్పు నుండి తమ యుద్ధ నౌకలను, సిబ్బందిని కాపాడుకోవడానికి పూర్తిగా ఆత్మరక్షణ కోసమే తాము ఈ ప్రతిదాడి చేపట్టినట్లు స్పష్టం చేసింది.
అమెరికా చేసిన దాడులపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా తీవ్రంగా స్పందించింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని సిరిక్ (Sirik) ద్వీపంలో ఉన్న తమ టెలికామ్ టవర్స్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకుందని IRGC ఆరోపించింది. దీనికి ప్రతిగా, అమెరికా దళాలు దాడుల కోసం ఉపయోగించిన ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని తాము క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడి చేసినట్లు ప్రకటించింది.
ఇరాన్ తమ ప్రకటనలో నిర్దిష్టంగా ఏ బేస్‌పై దాడి చేశామో వెల్లడించనప్పటికీ, కువైట్‌లోని అమెరికా ప్రధాన ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కువైట్ అంతటా ప్రమాద సైరన్లు మోగాయని, తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు శత్రు క్షిపణులను, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నాయని కువైట్ సైన్యం ధృవీకరించింది.


Click it and Unblock the Notifications
