Iran War: యుద్ధం ఆపాలంటే ఈ 3 పనులు చేయండి! అమెరికాకు ఇరాన్ డెడ్ లైన్!
మధ్య ప్రాచ్యంలో రక్తం చిందిస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధం (Iran War) ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. అమెరికా , ఇజ్రాయెల్‌తో జరుగుతున్న ఈ భీకర పోరాటాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మాసూద్ పెజెష్కియాన్ మూడు ప్రధాన షరతులను ప్రపంచ దేశాల ముందు ఉంచారు. అవేంటంటే..
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధం ముగించడానికి మూడు షరతులను పెట్టింది. రష్యా , పాకిస్థాన్ దేశాధినేతలతో మాట్లాడిన తర్వాత ఇరాన్ అధ్యక్షుడు తన డిమాండ్లను సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ద్వారా బహిరంగపరిచారు. ఈ యుద్ధం ఆగిపోవాలంటే అంతర్జాతీయ సమాజం ఈ కింది షరతులకు అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ పెట్టిన 3 ప్రధాన షరతులు..
- చట్టబద్ధమైన హక్కుల గుర్తింపు: ఇరాన్ దేశానికి ఉన్న సార్వభౌమత్వ హక్కులను, అంతర్జాతీయంగా తమకు రావాల్సిన గుర్తింపును అగ్రరాజ్యాలు అంగీకరించాలి.
- యుద్ధ పరిహారం (Reparations): ఈ యుద్ధం వల్ల ఇరాన్ మౌలిక సదుపాయాలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ భారీగా పరిహారం చెల్లించాలి.
- అంతర్జాతీయ గ్యారెంటీ: భవిష్యత్తులో ఇరాన్‌పై మళ్లీ ఎలాంటి దాడులు జరగవని, ఇతర దేశాల నుండి దురాక్రమణ ఉండదని అంతర్జాతీయ స్థాయిలో పటిష్టమైన హామీలు ఇవ్వాలి.
గల్ఫ్ దేశాలకు, అమెరికాకు సైన్యం హెచ్చరిక
ఒకవేళ అమెరికా గనుక ఇరాన్ ఓడరేవులపై దాడులకు దిగితే, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ఆర్థిక కేంద్రం లేదా ఓడరేవు సురక్షితంగా ఉండదని ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి అబోల్ఫాజల్ షేకర్చి హెచ్చరించారు. "మా ఓడరేవులకు ముప్పు వాటిల్లితే, ఈ ప్రాంతంలోని అన్ని దేశాల ఓడరేవులు మాకు చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారుతాయి" అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. గల్ఫ్ దేశాలు తమ భూభాగం నుండి అమెరికన్లను వెంటనే తరిమివేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్ అంచనా.. క్షేత్రస్థాయి పరిస్థితి..
ఇజ్రాయెల్ అధికారుల అంతర్గత చర్చల ప్రకారం.. భారీ దాడులు జరుగుతున్నప్పటికీ ఇరాన్ ప్రభుత్వం (Clerical Government) త్వరగా కూలిపోతుందనే నమ్మకం లేదు. బాంబు దాడుల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, సుప్రీం లీడర్ ఖమేనీ, ఇతర ఉన్నత సైనిక కమాండర్ల మరణం ఇరాన్ ప్రజల్లో ప్రతీకార వాంఛను పెంచిందని ఇజ్రాయెల్ భావిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ యుద్ధం త్వరలో ముగుస్తుందని చెబుతున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధం అంత త్వరగా ముగిసేలా కనిపించడం లేదని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం ఇరాన్ నగరాలపై క్షిపణుల వర్షం కురుస్తుండటంతో అక్కడి ప్రజలు నిరసనలు తెలపడానికి కూడా భయపడుతున్నారు. ఆర్థిక ఆంక్షలు ఇరాన్ నడ్డి విరుస్తున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ యుద్ధం (Iran War) ప్రపంచ శాంతికి , ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది.


Click it and Unblock the Notifications