హార్ముజ్ జలసంధి మూసివేత.. సముద్ర జల్లాలోకి ఏ దేశం నౌక వచ్చినా పేల్చేస్తామని ఇరాన్ కీలక ప్రకటన..
పశ్చిమాసియా దేశాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) లోని ఒక ఉన్నత అధికారి ప్రకటన మేరకు.. ఇరాన్ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గాన్ని అధికారికంగా మూసివేసినట్లు ప్రకటించింది. ఈ మార్గం గుండా ప్రయాణించేందుకు ప్రయత్నించే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతామని ఇరాన్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఇది పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి చమురు సంపన్న దేశాల నుంచి ఉత్పత్తి అయ్యే భారీ మొత్తంలో ముడిచమురు ఈ మార్గం ద్వారానే ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే మొత్తం చమురులో సుమారు 20 శాతం ఈ ఒక్క మార్గం మీదుగానే రవాణా అవుతుందని అంచనా.

ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రాంతీయ రాజకీయ ఉద్రిక్తతలే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న సైనిక ఘర్షణలు, ఇరాన్‌పై పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిళ్లు, శత్రుదేశాల చర్యలకు ప్రతీకారంగా ఈ చర్య చేపట్టినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ Hormuz మార్గంలోకి వచ్చే వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లు, సరుకు నౌకలు అన్నింటినీ శత్రు లక్ష్యాలుగా పరిగణిస్తామని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రపంచ షిప్పింగ్ రంగంలో కలవరం మొదలైంది. అనేక అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తమ నౌకలను హార్ముజ్ మార్గంలోకి పంపే కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని కంపెనీలు ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలను అన్వేషిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు తమ సిబ్బంది, నౌకల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీమా కవరేజ్ సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాయి.
ఇక ఆర్థిక రంగంపై ఈ పరిణామాల ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత వార్తలతో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ముడిచమురు సరఫరా తగ్గే అవకాశం ఉందన్న భయంతో మార్కెట్లు స్పందిస్తున్నాయి. ఇంధన ధరలు పెరిగితే దాని ప్రభావం రవాణా ఖర్చులు, ఉత్పత్తి ధరలు, ద్రవ్యోల్బణంపై పడే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్-అమెరికా సంబంధాలు మరింత ఉద్రిక్తకరంగా మారుతున్నాయి. అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు ఈ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛా నావికత్వం అంశం ఇప్పుడు గ్లోబల్ చర్చకు కేంద్రంగా మారింది. ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో స్పష్టత లేకపోయినా, ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇంధన భద్రత, వాణిజ్య రవాణా, ఆర్థిక స్థిరత్వంపై అప్రమత్తంగా దృష్టి సారిస్తున్నాయి.


Click it and Unblock the Notifications