భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.. జైశంకర్ దౌత్యం ఫలించిందా?
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. చమురు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ మూసివేయడం వల్ల ప్రపంచమంతా చమురు కోసం ఇబ్బంది పడుతోంది. అయితే ఇప్పుడు భారత జెండాతో ఉన్న చమురు నౌకలను ఇరాన్ అనుమతించిందని వార్తలొస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ ప్రతినిథి అబ్బాస్ అరఘచీతో జరిపిన చర్చల తర్వాత.. భారతీయ నౌకలకు ఇరాన్ ఊరటనిచ్చిందని వార్తలు వచ్చాయి. దీనిపై టెహ్రాన్ లోని ఒక మూలం స్పందిస్తూ, "అది నిజం కాదు" అని స్పష్టం చేసింది. అయితే, "పుష్పక్", "పరిమల్" అనే రెండు భారతీయ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితంగా వెళ్లినట్లు 'ఐఏఎన్ఎస్' (IANS) నివేదించింది. అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. భారతీయ నౌకలు హర్మోజ్ జలసంధి గుండా ప్రయాణించగలగడం విశేషం.

ముంబై చేరిన సౌదీ చమురు నౌక
ఇటీవల సౌదీ అరేబియా ముడి చమురుతో ఉన్న ఒక లైబీరియన్ జెండా నౌక, భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో హార్ముజ్ జలసంధిని దాటి ముంబై తీరానికి చేరుకుంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి ఈ జలసంధిని దాటి భారత్ చేరుకున్న మొదటి నౌక ఇదే. భారతదేశం తన చమురు, గ్యాస్ అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడటంతో ఈ సముద్ర మార్గం తెరిచి ఉండటం దేశ ఇంధన భద్రతకు అత్యంత కీలకం.
హార్ముజ్ జలసంధి ఎందుకు అంత ముఖ్యం?
హార్ముజ్ జలసంధి ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న 55 కిలోమీటర్ల వెడల్పు కలిగిన సముద్ర మార్గం.
- చమురు సరఫరా: ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో సుమారు 31 శాతం (రోజుకు 20 మిలియన్ బారెల్స్) ఈ మార్గం గుండానే వెళ్తుంది.
- వ్యూహాత్మక నియంత్రణ: ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లు , మైన్ల (Mines) ద్వారా ఈ జలసంధిని పూర్తిగా నియంత్రించగలదు.
- ఆంక్షలు: ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఇప్పటికే ప్రకటించిన ప్రకారం.. ఈ మార్గం గుండా వెళ్లే ఏ నౌక అయినా ఇరాన్ ముందస్తు అనుమతి పొందాలి. లేదంటే దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
భారత్ దౌత్య ప్రయత్నాలు
విదేశాంగ మంత్రి జైశంకర్ కేవలం ఇరాన్‌తోనే కాకుండా రష్యా , ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో కూడా సంప్రదింపులు జరిపారు. గల్ఫ్ ప్రాంతంలో స్థిరత్వం , సురక్షితమైన నౌకాయానాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అయితే ఇరాన్ భారత నౌకలను అనుమతించడం (Iran allows Indian ships) పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ.. భారత్ తన ఇంధన అవసరాల కోసం దౌత్యపరంగా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.
ఏదేమైనా ఈ ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత నౌకలను ఇరాన్ అనుమతించడం కొంత ఊరట కలిగించే విషయమే. మరి ముంబాయికి చేరిన చముర నౌక వల్ల దేశంలో కొంత వరకూ గ్యాస్ కొరత తగ్గే అవకాశం ఉందో లేదో వేచి చూడాలి. ఒకవేళ భారత నౌకలను అన్నింటినీ ఇరాన్ అనుమతిస్తే.. త్వరలోనే గ్యాస్ సంక్షోభానికి తెర పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications