Crude oil: ఇరాన్‌లో కేవలం 22 రోజుల ఆయిల్ మాత్రమే మిగిలి ఉందా? ఆ తర్వాత ప్రపంచం పరిస్థితి ఏంటి?
ప్రపంచ చమురు మార్కెట్‌లో ఇరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ దేశం ఒక వింతైన సమస్యను ఎదుర్కొంటోంది. ఇరాన్ దగ్గర నిల్వ ఉన్న ముడి చమురు (crude oil) నిల్వ చేసుకునేందుకు తగినంత స్థలం లేదని, కేవలం 12 నుండి 22 రోజులకు సరిపడా స్టోరేజ్ మాత్రమే మిగిలి ఉందని ప్రముఖ అనలిటిక్స్ సంస్థ 'కెప్లర్' (Kpler) వెల్లడించింది. దీనివల్ల ఇరాన్ తన చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిల్వలు నిండిపోయాయి.. ఉత్పత్తి తగ్గక తప్పదు!
ఇరాన్ తన దేశంలో ఉత్పత్తి చేస్తున్న ముడిచమురును ఇతర దేశాలకు ఎగుమతి చేయలేకపోతోంది. దీనివల్ల ఇప్పటికే తీసిన చమురు నిల్వ కేంద్రాల్లో నిండిపోయింది. మే మధ్య నాటికి ఇరాన్ రోజుకు అదనంగా 1.5 మిలియన్ బారెల్స్ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా ప్రకారం, ఇరాన్ తన ఉత్పత్తిని రోజుకు 2.5 మిలియన్ బారెల్స్ తగ్గించుకుంది. ఒక్క ఇరాన్ మాత్రమే కాదు.. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి దేశాలు కూడా ఫిబ్రవరి నుండి తమ ఉత్పత్తిని తగ్గించాయి.
ఎగుమతులపై అమెరికా దిగ్బంధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ ఓడరేవులపై నావికా దళాల దిగ్బంధం కొనసాగుతోంది. దీనివల్ల ముడి చమురు (crude oil) ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. మార్చి నెలలో రోజుకు 1.85 మిలియన్ బారెల్స్ ఎగుమతి చేసిన ఇరాన్, ఇప్పుడు కేవలం 5.67 లక్షల బారెల్స్ మాత్రమే పంపగలుగుతోంది. అంటే ఎగుమతులు ఏకంగా 70 శాతం తగ్గిపోయాయి. అతి ముఖ్యమైన 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) గుండా ఏ ఆయిల్ ట్యాంకర్ కూడా అమెరికా కళ్ళు గప్పి బయటకు వెళ్లలేకపోతోంది.
ఇరాన్ ఆర్థిక పరిస్థితి ఏంటి?
ముడిచమురు ఎగుమతులు తగ్గిపోయినప్పటికీ, ఇరాన్‌కు దీని ఆర్థిక సెగ తగలడానికి మరో 3 నుండి 4 నెలల సమయం పట్టవచ్చు. ఎందుకంటే..
- ఇరాన్ నుండి చైనా వంటి దేశాలకు ఆయిల్ చేరడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుంది.
- ఆ తర్వాత చెల్లింపులు (Payments) జరగడానికి మరో రెండు నెలలు పడుతుంది. అయితే అమెరికా విధిస్తున్న ఆంక్షలు కఠినతరం కావడంతో, భవిష్యత్తులో ఇరాన్ ఆదాయం భారీగా పడిపోయే ప్రమాదం ఉంది.
ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు (crude oil) లో ఎక్కువ భాగం ఈ ప్రాంతం నుండే వస్తుంది. ఇక్కడ యుద్ధ వాతావరణం లేదా ఎగుమతుల నిలిపివేత జరిగితే, ఆటోమేటిక్‌గా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది భారతీయ వినియోగదారులపై కూడా పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో పడే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లకు అతిపెద్ద ముప్పుగా పరిణమించాయి.


Click it and Unblock the Notifications