పిచ్చి బాస్టర్డ్స్ అంటూ ఇరాన్ మీద విరుచుకుపడిన ట్రంప్.. హార్మూజ్ జలసంధిపై తగ్గేదేలే అంటున్న ఇరాన్..
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - ఇరాన్ మధ్య నెలకొన్న మాటల యుద్ధం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాడులు ఉద్రిక్తతలను మరింత దట్టం చేశాయి. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి వేదికగా ఈ పోరు సాగుతోంది.
హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని ఇరాన్‌కు ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఏప్రిల్ 6 (సోమవారం) నాటికి ఆంక్షలు ఎత్తివేయకపోతే, మంగళవారాన్ని ఇరాన్ చరిత్రలో అత్యంత దారుణమైన రోజుగా మారుస్తానని ఆయన హెచ్చరించారు.
మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అంటూ ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను, వంతెనలను సర్వనాశనం చేస్తామని, అవసరమైతే అక్కడి చమురు నిల్వలను కూడా స్వాధీనం చేసుకుంటామని ట్రూత్ సోషల్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, నిరసనకారులకు పంపిన ఆయుధాలు కుర్దిష్ గ్రూపుల దగ్గర ఉండిపోయి ఉండవచ్చని చెబుతూ, ఇరాన్ అంతర్గత పరిస్థితులపై కూడా Trump వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇరాన్ మీద పిచ్చి బాస్టర్డ్స్ అంటూ బూతు పదాలతో విరుచుకుపడ్డారు.

ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్-బాఘెర్ ఘాలిబాఫ్ స్పందిస్తూ.. ట్రంప్ తన దేశాన్ని, ప్రతి అమెరికా కుటుంబాన్ని నరకంలోకి లాగుతున్నారని విమర్శించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలను పాటిస్తూ పశ్చిమాసియాను ట్రంప్ దహనం చేస్తున్నారని, ఈ యుద్ధ నేరాల వల్ల అమెరికాకు ఎలాంటి లాభం ఉండదని హితవు పలికారు. ఇరాన్ సైనిక కమాండర్లు సైతం ట్రంప్ వ్యాఖ్యలను "తెలివితక్కువ చర్యలు"గా కొట్టిపారేస్తూ, యుద్ధం వస్తే అమెరికాకు ఊబిలా మారుతుందని హెచ్చరించారు.
ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) నివేదికల ప్రకారం, ఈ ఘర్షణల్లో అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడుల్లో అమెరికా ఇప్పటివరకు 19 యుద్ధ విమానాలను కోల్పోయినట్లు సమాచారం. వీటిలో కోట్ల విలువైన F-15E ఫైటర్ జెట్లు, A-10 థండర్ బోల్ట్ విమానాలు ఉన్నాయి. అలాగే భారీ నిఘా విమానమైన బోయింగ్ E-3 సెంట్రీ కూడా ఉంది. సుమారు రూ. 4,700 కోట్ల విలువైన 17 MQ-9 రీపర్ డ్రోన్లు నేలమట్టం అయ్యాయి. ఇంత భారీ స్థాయిలో యుద్ధ సాగ్రిని కోల్పోవడం అమెరికా రక్షణ రంగానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు.
ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా హార్ముజ్ జలసంధి మార్గం ద్వారానే జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా మూసివేస్తే, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది కేవలం అమెరికాకే కాకుండా, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నింటినీ దెబ్బతీస్తుంది. నేటితో (సోమవారం) ట్రంప్ విధించిన గడువు ముగియనుండటంతో, మంగళవారం నాడు అమెరికా ఎలాంటి చర్యలకు దిగుతుంది? ఇరాన్ ఎలా ఎదురుదాడి చేస్తుంది? అనే అంశాలపై ప్రపంచం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే, పశ్చిమాసియా మరో పెను యుద్ధానికి వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications