ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు డిజిటల్ యుద్ధ క్షేత్రానికి మళ్లాయి. బహ్రెయిన్‌లోని ప్రముఖ టెలికాం సంస్థ లక్ష్యంగా ఇరాన్ చేసిన సైబరాబాద్ దాడి అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.ఇరాన్ మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు బహ్రెయిన్‌కు చెందిన అగ్రశ్రేణి టెలికమ్యూనికేషన్ కంపెనీపై దాడి చేశాయి.
ఈ కంపెనీ కేవలం బహ్రెయిన్‌కే పరిమితం కాకుండా, అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం 'అమెజాన్ వెబ్ సర్వీసెస్' (AWS) కు ఆతిథ్యం ఇస్తుండటం గమనార్హం. అమెరికాకు చెందిన ఒక ప్రముఖ టెక్ కంపెనీ మౌలిక సదుపాయాలపై ఇరాన్ నేరుగా చేసిన మొదటి సైబర్ దాడిగా దీనిని నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ దాడి కారణంగా బహ్రెయిన్‌లోని డిజిటల్ నెట్‌వర్క్‌లు, అమెజాన్ సర్వీసులకు అంతరాయం కలిగింది.

గత కొన్ని వారాలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్న తరుణంలో, Iran ఈ సైబర్ దాడితో తన ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. భౌతిక దాడుల కంటే సైబర్ దాడులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవని, అదే సమయంలో ప్రత్యర్థి దేశాల ఆర్థిక, సాంకేతిక వ్యవస్థలను కుప్పకూల్చడానికి ఇవి శక్తివంతమైన ఆయుధాలని ఇరాన్ భావిస్తోంది. ముఖ్యంగా అమెరికా క్లౌడ్ సేవలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ టెక్ కంపెనీలకు ఇరాన్ ఒక గట్టి హెచ్చరికను పంపింది.
మధ్యప్రాచ్యంలో అమెరికాకు బహ్రెయిన్ అత్యంత సన్నిహిత మిత్రదేశం. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదవ నౌకాదళం (5th Fleet) ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. అంతేకాకుండా, అబ్రహం ఒప్పందాల తర్వాత ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపరుచుకున్న గల్ఫ్ దేశాలలో బహ్రెయిన్ ఒకటి. ఈ నేపథ్యంలో, బహ్రెయిన్ యొక్క టెక్ మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం ద్వారా అటు అమెరికాను, ఇటు గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరిస్తోంది.
ఈ సైబర్ దాడి వార్త బయటకు వచ్చిన వెంటనే అంతర్జాతీయ టెక్ మార్కెట్లలో ఆందోళన మొదలైంది. అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై సైనిక చర్యను ముమ్మరం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో, ఈ తాజా సైబర్ దాడి అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై అమెరికా చేపట్టబోయే ఆపరేషన్‌లో భాగంగా ఈ సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడానికి ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ బలగాలను రంగంలోకి దించే అవకాశం ఉంది.
ఈ దాడి కేవలం ఒక ఆరంభం మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైతే, అది కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా సాఫ్ట్‌వేర్, విద్యుత్ గ్రిడ్లు మరియు బ్యాంకింగ్ వ్యవస్థల వరకు విస్తరిస్తుంది. అమెరికా తన సైనిక లక్ష్యాలను పూర్తి చేయడానికి దగ్గరలో ఉన్నానని చెబుతున్న వేళ, ఇరాన్ తన సైబర్ సామర్థ్యంతో అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి సిద్ధమవుతోంది. చమురు సరఫరా మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఒత్తిడిలో ఉండగా, ఇటువంటి డిజిటల్ దాడులు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తాయి.
ఏదేమైనా బహ్రెయిన్ టెలికాం, అమెజాన్ సర్వీసులపై జరిగిన ఈ దాడి, ఆధునిక యుద్ధం కేవలం క్షిపణులతోనే కాదు, కంప్యూటర్ కోడ్లతో కూడా జరుగుతుందని మరోసారి నిరూపించింది. రాబోయే రోజుల్లో అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుని ఇరాన్ సైబర్ విభాగాలపై కూడా దాడులు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications