ఐపీఎల్ వేలంలో కామెరాన్ గ్రీన్ మీద కాసుల వర్షం... రూ. 25.20 కోట్లకు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంపైనే ఉంది. తాజాగా ఈ వేలంలో ఆసీస్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఊహించినట్టుగానే కామెరూన్ గ్రీన్‌పై కాసుల వర్షం కురిసింది. అతడిని దక్కించుకోవడానికి ప్రధాన జట్లు పోటీపడగా, చివరకు రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) గ్రీన్‌ను సొంతం చేసుకుంది. ఈ కొనుగోలు ఐపీఎల్ వేలంలోనే కాకుండా ఈ సీజన్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. కాగా కామెరూన్ గ్రీన్ కనీస ధర రూ.2 కోట్లుగా ఉంది.
వేలం ప్రారంభమైన వెంటనే కామెరూన్ గ్రీన్ పేరు తెరపై కనిపించగానే కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ మొదలైంది. యువ ఆటగాడు కావడం, ఆల్‌రౌండర్‌గా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ప్రభావం చూపగలగడం గ్రీన్‌కు డిమాండ్‌ను భారీగా పెంచింది. కొద్దిసేపటి బిడ్డింగ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ పోటీ నుంచి తప్పుకోవడంతో కేకేఆర్ ముందంజలో నిలిచింది. అయితే ఇక్కడితో పోటీ ముగియలేదు. రాజస్థాన్ తప్పుకున్న వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రంగంలోకి దిగింది.

కేకేఆర్-సీఎస్‌కే మధ్య తీవ్ర స్థాయి బిడ్డింగ్ వార్ సాగింది. ప్రతి పెంపుతో ధర కొత్త గరిష్టాలను తాకుతూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై ఎప్పుడూ ఆసక్తి చూపే సీఎస్‌కే కూడా గ్రీన్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధమైంది. చివరి దశలో ధర రూ. 25 కోట్ల మార్క్‌ను దాటిన తర్వాత సీఎస్‌కే వెనక్కి తగ్గింది. దీంతో రూ. 25.20 కోట్ల తుది ధరకు కామెరూన్ గ్రీన్ కేకేఆర్ ఖాతాలోకి వెళ్లాడు. ఈ కొనుగోలుతో కేకేఆర్ తమ జట్టును మరింత బలపరిచుకున్నట్లయింది. మిడిల్ ఆర్డర్‌లో పవర్ హిట్టర్‌గా, అవసరమైనప్పుడు వేగవంతమైన బౌలింగ్ ఆప్షన్‌గా Cameron Green.. కేకేఆర్‌కు కీలకంగా మారనున్నాడు.రాబోయే ఐపీఎల్ సీజన్‌లో గ్రీన్ ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తకిరంగా మారింది.
ఐపీఎల్-2026 మినీ వేలం టీమిండియా యువ ఆటగాళ్లకు నిరాశను మిగిల్చింది. భారత ఓపెనర్ పృథ్వీ షా మరోసారి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చినప్పటికీ, అతడిని కొనుగోలు చేసేందుకు ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దీంతో పృథ్వీ షా ఈ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. గత కొన్నేళ్లుగా ఫామ్ లోపం, ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు అతడి కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పృథ్వీ షాతో పాటు న్యూజిలాండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వే కూడా ఈ మినీ వేలంలో అమ్ముడుపోలేదు. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న ఆటగాడు అయినప్పటికీ, ఫ్రాంచైజీలు అతడిపై ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని కూడా ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
ఈ వేలంలోకి వచ్చిన తొలి ఆటగాడిగా ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ నిలిచాడు. రూ.2 కోట్ల కనీస ధరతో వచ్చినప్పటికీ, అతడిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. యువ ప్రతిభ ఉన్నప్పటికీ, జట్ల అవసరాలకు సరిపోని కారణంగా అతడికి అవకాశం దక్కలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ఐపీఎల్-2026 మినీ వేలంలో అమ్ముడుపోయిన తొలి ప్లేయర్‌గా డేవిడ్ మిల్లర్ నిలిచాడు. అనుభవజ్ఞుడైన ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల కనీస ధరకు సొంతం చేసుకుంది. ఫినిషర్‌గా పేరున్న మిల్లర్ చేరికతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్ మరింత బలపడనుంది.


Click it and Unblock the Notifications