ఒక్క బిల్లుతో IPL పని ఖేల్ ఖతం.. రూ.5 వేల కోట్ల నష్టాలు..భోరుమంటున్న స్పాన్సర్లు
కోట్ట రూపాయలను కుమ్మరించే ఐపీఎల్ మీద ఆన్‌లైన్ గేమింగ్ ప్రకటనల నిషేధం ప్రభావం పడింది. భారత క్రికెట్‌లో అతిపెద్ద పండుగగా భావించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు ఈ సారి భారీ షాక్ తగలనుంది. లోక్‌సభలో ఆమోదించబడిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు, 2025 తో రియల్ మనీ గేమింగ్ (RMG) మరియు ఫాంటసీ స్పోర్ట్స్ ప్రకటనలపై నిషేధం విధించారు. ఈ నిర్ణయం IPLకి దాదాపు రూ. 5 వేల కోట్లు నష్టాలు తీసుకురానుంది. దీనికి కారణం ప్రకటనలు..ఈ గేమింగ్ కంపెనీలు దాదాపు రూ. 5,000 కోట్లు ప్రకటనల రూపంలో ఇస్తున్నాయి.
IPL సీజన్‌లో ప్రతి సంవత్సరం బిలియన్ డాలర్ల విలువైన ప్రకటనలు కనిపిస్తుంటాయి. 2025లో IPL మొత్తం ప్రకటన ఖర్చు సుమారు రూ. 5 వేల కోట్లకు చేరుకుంది. ఇందులో 40 శాతం అంటే సుమారు రూ. 2వేల కోట్లు RMG, ఫాంటసీ స్పోర్ట్స్ బ్రాండ్‌ల నుండి వచ్చాయి. Dream11, My11Circle, Real Cricket వంటి బ్రాండ్‌లు ఈ వర్గంలో ప్రధానమైనవిగా ఉన్నాయి. ఇప్పుడు నిషేధం కారణంగా ఈ మొత్తం వర్గం ప్రకటనలు ఆగిపోనున్నాయి.

RMG కంపెనీలు తమ ప్రకటనలలో 80-90శాతం బడ్జెట్‌ను IPL సీజన్‌లోనే ఖర్చు చేస్తాయి. వీటిలో ఎక్కువ భాగం డిజిటల్ ఖర్చు రూపంలో ఉంటుంది. మెటా, గూగుల్, ప్రోగ్రామాటిక్ అడ్స్, క్రియేటర్ కలాబరేషన్స్, జట్టు స్థాయి బ్రాండింగ్‌లలో ఇది కేంద్రీకృతమై ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం.. ఈ నిషేధం డిజిటల్ స్పేస్‌లోనే దాదాపు 3 వేల నుంచి రూ. 4,500 కోట్ల ప్రకటన ఆదాయాన్ని ప్రమాదంలోకి నెడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి టీవీ, OTT, ప్రింట్, అవుట్‌డోర్ లను కలుపుకుంటే ప్రభావం రూ. 7 వేల కోట్ల వరకు చేరవచ్చు.
ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం.. వాట్సాప్ సహా ఏ మీడియా లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ద్వారా కూడా RMG ప్రకటనలు పూర్తిగా నిషేధం. ఎవరైనా ఉల్లంఘిస్తే, వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించబడే అవకాశం ఉంది. దీంతో ప్రకటనదారులు మాత్రమే కాదు, ప్రచురణకర్తలు, ఇన్ఫ్లూయెన్సర్లు కూడా రిస్క్‌ను ఎదుర్కోనున్నారు.
IPL ఆదాయం BCCIకి హార్ట్ వంటిదని చెప్పవచ్చు. మీడియా హక్కుల ద్వారానే ఆదాయం 2025లో రూ. 9,678 కోట్లు వచ్చాయి. అదనంగా ఫ్రాంచైజీ స్పాన్సర్‌షిప్‌లు కూడా IPL సంపాదనలో కీలక భాగం. ఉదాహరణకు చూసుకున్నట్లయితే.. Dream11 ఐదు ఫ్రాంచైజీల (KKR, LSG, PBKS, SRH, GT) కు ఫ్రంట్-ఆఫ్-షర్ట్ స్పాన్సర్‌గా ఉంది. ఇప్పుడు ఈ ఒప్పందాలు ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది.
ఇక ప్రచురణ రంగం కూడా ఈ నిషేధంతో నష్టపోనుంది. ప్రకటనదారులు ఖర్చు చేసే CPM (Cost per Mille) తగ్గినప్పుడు, ప్రచురణకర్తలకు వచ్చే ఆదాయం క్షీణిస్తుంది. దాంతో క్విక్ కామర్స్, న్యూస్ ప్లాట్‌ఫారమ్‌లు తమకు ఉన్న నమ్మకమైన బడ్జెట్‌ను కోల్పోతాయని బజ్‌లాబ్ CEO సింధు బిస్వాల్ తెలిపారు.
నిపుణుల అంచనా ప్రకారం ఈ డబ్బు అంతా ఇతర రంగాలకు మళ్లుతుంది. ఫిన్‌టెక్, ఇ-కామర్స్, యుటిలిటీ యాప్‌లు, RMG కాని గేమింగ్ బ్రాండ్‌లు IPLలో ప్రకటన ఖర్చును పెంచే అవకాశం ఉంది. కొంత భాగం CRM, WhatsApp మార్కెటింగ్, లాయల్టీ ప్రోగ్రామ్స్ వైపు వెళ్తుంది. మిగిలిన భాగం బ్రాండ్-సేఫ్ కంటెంట్, స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్ ఫార్మాట్‌లలోకి వెళ్లవచ్చని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications