iPhone News: అమెరికా-చైనాల మధ్య నడుస్తున్న పొలిటికల్ హీట్ సెగ కంపెనీలను తాకింది. అమెరికాకు చెందిన ఐఫోన్ తయారీదారు ఆపిల్ స్టాక్ రెండు రోజులుగా కుప్పకూలటం లక్షల కోట్లను ఆవిరి చేసింది.
దీనంతటికీ కారణం చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. ప్రభుత్వ అధికారులు పని ప్రాంతాల్లో ఐఫోన్లను వినియోగించవద్దంటూ నిషేధం విధించటంతో ఆపిల్ సంస్థపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ క్రమంలో ఆపిల్ మార్కెట్ క్యాప్ 20 వేల కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.16.61 లక్షల కోట్ల విలువను కోల్పోయింది. ప్రకటన వెలువడిన తర్వాత బుధవారం స్టాక్ 4 శాతానికి పైగా క్షీణతను నమోదు చేసింది. గురువారం సైతం 3 శాతం మేర పడిపోవటంతో భారీగా విలువ హరించుకుపోయింది.

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులపై ఐఫోన్ నిషేధానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే నివేదికల ప్రకారం.. అధికారులు ఐఫోన్‌లతో కార్యాలయానికి రాకూడదని, కార్యాలయంలో అధికారిక పనులకు ఐఫోన్‌లను ఉపయోగించకూడదని ఆదేశించారు. అయితే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నిషేధం విధించారా.. లేక కొన్ని కార్యాలయాలకు మాత్రమే దీనిని పరిమితం చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒక వేళ ప్రభుత్వ ఉద్యోగులందరూ ఐఫోన్‌ను కలిగి ఉండకుండా నిషేధించినట్లయితే అమ్మకాలు సుమారు 5 శాతానికి పైగా తగ్గవచ్చని తెలుస్తోంది.
ఆపిల్ సంస్థలో ప్రపంచ కుబేరుడు, ప్రఖ్యాత పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ భారీగా పెట్టుబడులను కలిగి ఉన్నారు. కేవలం రెండు రోజుల్లోనే కంపెనీ 200 బిలియన్ డాలర్ల విలువను కోల్పోయింది. స్టాక్‌సర్కిల్ డేటా ప్రకారం వారెన్ బఫెట్ 167 బిలియన్ డాలర్లు విలువైన 916 మిలియన్ ఆపిల్ షేర్లను కొనుగోలు చేశారు. ఇది బఫెట్ స్టాక్ పోర్ట్‌ఫోలియోలో 49.83%గా ఉంది. 2016 తర్వాత వారెన్ బఫెట్ ఆపిల్ షేర్లను దాదాపు 13 సార్లు కొనుగోలు చేశారు. తాజా చర్యల వల్ల వారెన్ బఫెట్ సైతం భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications