Stock Market: మార్కెట్ల పతనం ఇందుకే.. రూ.3.5 లక్షల కోట్లు ఆవిరి..
Market Crash: పండుగ తర్వాత మార్కెట్లలో ఒక్కసారిగా భయాలు పుంజుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన బేర్స్ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో ఏకంగా రూ.3.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో వారంలో మూడో ట్రేడింగ్ రోజున పరిస్థితులు పూర్తిగా చేజారిపోయాయి.
స్టాక్ మార్కెట్ 2024 సంవత్సరంలో మొదటి అతిపెద్ద క్షీణతను నేడు చూశాయి. దీనికి పెరుగుతున్న కరోనా కేసులతో పాటు అనేక ఇతర కారణాలు సైతం ఉన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ సూచీ ఏకంగా 1500 పాయింట్లను కోల్పోయి 71,683.87 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ గరిష్ఠంగా 400 పాయింట్లను కోల్పోయింది.

పతనానికి ప్రధాన కారణం బ్యాంకింగ్ షేర్ల విక్రయం ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో సహా చాలా బ్యాంకింగ్ లేదా ఎన్‌బీఎఫ్‌సీల షేర్లలో పెద్ద పతనం కనిపించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 7 శాతానికి పైగా పడిపోయాయి. కోటక్, యాక్సిస్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ వంటి పెద్ద బ్యాంకులు లేదా ఎన్‌బిఎఫ్‌సిల షేర్లు కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి. అలాగే ఇన్వెస్టర్లు భయాల మధ్య లాభాల బుక్కింగ్ ప్రారంభించటంతో పరిస్థితులు పూర్తిగా బేర్స్ చేతిలోకి జారుకున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు గరిష్ఠాలకు చేరుకోవటంతో పాటు కొనసాగిన నిరంతర పెరుగుదల.. మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ వైపు మళ్లుతుందనే భయం నెలకొంది.ఇప్పుడు ఈ భయాందోళన నిజమని తేలింది. దీనికి తోడు అంతర్జాతీయంగా డాలర్ తన బలాన్ని పుంజుకోవటం మార్కెట్లను దెబ్బతీసింది. డాలర్ ఇండెక్స్ పెరిగినప్పుడు, ముడి చమురు, ఇతర వస్తువులు మరింత ఖరీదైనవిగా మారుతాయి. ఇది మన కరెంట్ ఖాతా లోటు పెరిగేందుకు ప్రతికూలంగా దోహదపడుతుంది.
మరో పక్క ఆసియా మార్కెట్లు సైతం క్షీణతను చూస్తున్నాయి. చైనా స్టాక్ మార్కెట్‌లో కలకలం రేగుతోంది. 2019 ప్రారంభం నుంచి కనిష్ట స్థాయికి చేరువలో ఉంది. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 3 శాతం పడిపోయింది.దక్షిణ కొరియా కోస్పీ సూచీ 2.25 శాతం పడిపోయింది. జపాన్ నిక్కీ ఇండెక్స్ కూడా మందకొడిగా కనిపించింది. వీటికి తోడు కొత్త కరోనా కేసులు భయాలకు కారణంగా నిలుస్తున్నాయి. ఇలా అనేక కారణాలు నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు రూ.3.50 లక్షల కోట్లను కోల్పోవటానికి కారణాలుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications